Begin typing your search above and press return to search.

ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

By:  Tupaki Desk   |   4 Dec 2020 4:30 PM GMT
ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం
X
అధికారపార్టీ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. స్దానిక సంస్దల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కరోనా వైరస్ కారణంగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవని ఏకంగా అసెంబ్లీలోనే తీర్మానం చేసింది. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేయటమే ఆశ్చర్యంగా ఉంది. రాబోయే ఫిబ్రవరిలో ఎన్నికలను నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

కరోనా వైరస్ కారణంగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్దితులు లేవని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని చెప్పినా నిమ్మగడ్డ వినటం లేదు. అయితే ఇదే విషయమై ఎలక్షన్ కమీషన్ కు వ్యతిరేకంగా ప్రభుత్వమే హైకోర్టులో ఓ కేసు కూడా వేసింది. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణ దశలో ఉంది. ఇంతలో ఎన్నికలను నిర్వహించాలన్న నిమ్మగడ్డ నిర్ణయంపై అసెంబ్లీలో తీర్మానం చేయటం ఆశ్చర్యంగానే ఉంది.

తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదని చెప్పారు. కానీ నిమ్మగడ్డ మాత్రం ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే తన ఏర్పాట్లు తాను చేసుకుంటున్నట్లు మండిపడ్డారు. మొన్నటి మార్చిలో జరుగుతున్న ఎన్నికలను నిమ్మగడ్డ అర్ధాంతరంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఎన్నికలను వాయిదా వేయటంతో ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు అప్పటి నుండి పెద్ద వివాదమే నడుస్తోంది.

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఏపిలో మాత్రం ఎందుకు ఎన్నికలు పెట్టకూడదన్నది నిమ్మగడ్డ వాదన. తన వాదనకు మద్దతుగా బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను చూపించారు గతంలోనే. అయితే కరోనా వైరస్ సమస్య అన్నది అన్నీ రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదని, బీహార్ తో పోల్చుకుంటే ఏపిలో చాలా ఎక్కువగా ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. మరి ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ తీర్మానం చేయటం కాస్త ఆసక్తిగానే ఉంది.