Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డపై ఫిర్యాదు తప్పదా ?

By:  Tupaki Desk   |   18 March 2021 4:12 AM GMT
నిమ్మగడ్డపై ఫిర్యాదు తప్పదా ?
X
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. కమీషనర్ వ్యవహార శైలిపై గవర్నర్ తో పాటు హైకోర్టుకు ఫిర్యాదులు చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారట. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా కోర్టు ద్వారా గ్రీన్ సిగ్నల్ తెప్పించుకున్న నిమ్మగడ్డ పరిషత్ ఎన్నికల నిర్వహణలో మాత్రం జాప్యం చేస్తున్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది.

పోయిన సంవత్సరం కరోనా వైరస్ సమస్య పెద్దగా లేనపుడు వైరస్ ను బూచిగా చూపించి నిమ్మగడ్డ స్ధానికసంస్ధల ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటికన్నా కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్ళీ వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించారు. అప్పట్లో అయినా ఇప్పుడైనా ప్రభుత్వం చెప్పిన మాటను నిమ్మగడ్డ ఏమాత్రం లెక్కచేయలేదు. చివరకు కోర్టు ఆదేశాల కారణంగా ప్రభుత్వం ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.

పంచాయితి ఎన్నికలను, మున్సిపల్ ఎన్నికలను వరుసగా నిర్వహించేసిన నిమ్మగడ్డ పరిషత్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఏమీ మాట్లాడటంలేదు. కమీషనర్ రిటైర్ అవ్వటానికి ఇంకా 13 రోజులుంది. ఈ వ్యవధిలో పరిషత్ ఎన్నికలు నిర్వహించేయచ్చు. అయినా ఆ విషయమై నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పరిషత్ ఎన్నికలను కూడా నిర్వహించేస్తే కరోనా వ్యాక్సినేషన్+ఇతర కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని జగన్ భావించారు. అయితే నిమ్మగడ్డ ఏమి ఆలోచిస్తున్నారో తెలీదు.

ఇదే విషయమై ముందు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తర్వాత హైకోర్టుకు నిమ్మగడ్డ వ్యవహారంపై ఫిర్యాదు చేయాలని చీఫ్ సెక్రటరీని జగన్ ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించాలని పంచాయితిరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినా నిమ్మగడ్డ రెస్పాండ్ కాలేదు. మరి చీఫ్ సెక్రటరీ మాట్లాడిన తర్వాత ఏమవుతుందో చూడాలి.