Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ గల్లాకు షాకిచ్చిన జగన్

By:  Tupaki Desk   |   30 Jun 2020 1:00 PM GMT
టీడీపీ ఎంపీ గల్లాకు షాకిచ్చిన జగన్
X
ప్రముఖ పారిశ్రామిక వేత్త కం టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు వైఎస్ జగన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. చిత్తూరు జిల్లాలో గల్లా జయదేవ్ కు చెందిన ప్రముఖ కంపెనీ ‘అమర రాజా ఇన్ ఫ్రాటెక్’కు గతంలో కేటాయించిన 253.61 ఎకరాల భూమిని తిరిగి తీసుకొని ఆయనకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వంతో ఒప్పందం, నిబంధనలు, షరతులను గల్లా కంపెనీ ఉల్లంఘించిందని.. పెట్టుబడులు తీసుకువస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని.. ఉపాధి కల్పిస్తానన్న హామీని నిలబెట్టుకోలేదని.. అందుకే ఈ రూ.60 కోట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టు జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

2008 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి) ద్వారా అమరా రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు 483.27 ఎకరాల భూమిని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ వరల్డ్ సిటీలో కేటాయించింది. యాదమర్రి మండలంలోని మజారా కోతపల్లి - నూనెగుండ్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సెజ్ లో అమర్ రాజాకు ఈ భూమిని ఇచ్చింది. 2010 నవంబర్ లో రూ.10.70 కోట్ల ఈ భూమిని రూ.51.30లక్షల ప్రాసెసింగ్ ఫీజుతో అలాట్ చేసింది.

ఒప్పందం ప్రకారం, అమరా రాజా ఇన్ ఫ్రాటెక్ కంపెనీ కేటాయించిన 2 సంవత్సరాల వ్యవధిలో పరిశ్రమ పెట్టి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి. లేకపోతే కేటాయించిన భూమిని తిరిగి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని నాడు ఒప్పందంలో పేర్కొన్నారు. వినియోగించని భూమిని తిరిగి తీసుకునే అధికారం ఏపీఐఐసీకి ఉందని జీవోలో పేర్కొన్నారు.

అయితే అమర్ రాజా కంపెనీ ఈ భూమిలో కొంత నిర్మాణాలను చేపట్టకుండా వదిలేసింది. అలా 483.27 ఎకరాల్లో 229.66 ఎకరాలను మాత్రమే ఉపయోగించుకుంది.

కంపెనీ హామీనిచ్చి 2100 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురాలేదు. అలాగే 20వేల మందికి ఉపాధి కల్పించలేదు. అందుకే ఈ భూమిని తిరిగి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కేటాయించిన భూమిలో సెజ్ ఏదీ అభివృద్ధి చేయకపోవడంతో భూమిని వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.