Begin typing your search above and press return to search.

కొత్త అప్పు కోసం ఏపీ సర్కారు వెయిటింగ్.. ఈసారి ఎంతంటే?

By:  Tupaki Desk   |   16 Dec 2021 1:23 AM GMT
కొత్త అప్పు కోసం ఏపీ సర్కారు వెయిటింగ్.. ఈసారి ఎంతంటే?
X
అప్పుకు మించిన దారుణ వ్యసనం మరొకటి ఉండదు. ఒకసారి చేయి చాచి అడగటం మొదలయ్యాక.. అది అలా సాగుతూనే ఉంటుంది. ఒకప్పుడు ఓవర్ డ్రాప్టుకు వెళ్లటాన్నే అవమానంగా భావించేవారు. అలా వెళ్లిన ప్రతిసారి తమకు ఎదురైన పరిస్థితికి కిందా మీదా పడేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోగా.. చేసిన అప్పు నిర్దేశించిన సమయానికి ముందే ఖర్చు అయిపోవటమే కాదు.. కొత్త అప్పు కోసం కేంద్రం దయ కోసం వెయిటింగ్ చేసే దారుణ పరిస్థితిని ప్రస్తుతం ఏపీ సర్కారు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఓవర్ డ్రాప్టులో ఉన్న ఏపీ ప్రభుత్వం.. రూ.1400 కోట్ల ఓడీ సౌకర్యాన్ని పూర్తిగా ఖర్చు చేసేయటమే కాదు.. మరింత సాయం కోసం ప్రయత్నాలు చేస్తోంది.

నెలకు సగటున రూ.4వేల కోట్ల వరకు ఏపీ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటూ అవసరాల్ని తీర్చుకుంటోంది. డిసెంబరు నెలాఖరు వరకు కేంద్రం ఇచ్చిన రుణ పరిమితిని ఇప్పటికే వాడేసిన ఏపీ సర్కారు.. మరో కొత్త అప్పు కోసం కేంద్రం అనుమతి కోసం నిరీక్షిస్తోంది. ఇది సరిపోనట్లు నెలవారీ అవసరాల కోసం రాష్ట్రం బహిరంగ మార్కెట్లో రుణాల్ని సమీకరిస్తోంది. ఆర్థిక సంవత్సరంలో కేవలం తొమ్మిది నెలలు మాత్రమే ముగియటం.. మరో మూడు నెలలు సమయం ఉన్న వేళ.. కొత్త అప్పు కోసం ప్రయత్నాల్ని షురూ చేసింది.

కొత్తగా అప్పులు చేయటం కోసం ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ పేరుతో కొత్త రుణాల్ని సమీకరించే ప్రయత్నం చేయటం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా కేంద్రం రూ.20,751 కోట్లు.. రూ.10,500 కోట్ల రుణాన్ని సేకరించేందుకు వీలుగా బహిరంగ మార్కెట్ నుంచి రుణాల్ని తీసుకునేందుకు అనుమతిని ఇచ్చింది. ఈ మొత్తాల్ని డిసెంబరు మొదట్లోనే వాడేశారు. చేతిలో డబ్బులన్ని అయిపోవటంతో.. కొత్త అప్పు కోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర సర్కారు.. కేంద్రం అనుమతి ఇచ్చేందుకు వీలుగా ప్రయత్నాల్ని షురూ చేసింది. కేంద్రంలోని మోడీ సర్కారు ఎప్పటికి దయ తలుస్తుందో చూడాలి.