Begin typing your search above and press return to search.

జీతాలు, పింఛన్ల బిల్లులు ప్రాసెస్ చేయండి: ఏపీ సర్కార్ హెచ్చరిక

By:  Tupaki Desk   |   27 Jan 2022 4:30 PM GMT
జీతాలు, పింఛన్ల బిల్లులు ప్రాసెస్ చేయండి: ఏపీ సర్కార్ హెచ్చరిక
X
ఏపీ ఉద్యోగులతో ప్రభుత్వం ఫైట్ మరింత రాజుకుంది. తగ్గేదేలే అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు ఉద్యమిస్తున్నా.. ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఉద్యోగుల జీతాలు, పింఛన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆర్థికశాఖ మరోసారి సర్క్యూలర్ జారీ చేసింది.

కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పింఛన్ల బిల్లులు ఉండాలని సూచించింది. ఈ మేరకు సాయంత్రంలోగా బిల్లులు అప్ లోడ్ చేయాలని డీడీవోలకు గడువు విధించింది.

గడువులోగా బిల్లుల ప్రక్రియ చేపట్టకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు రేపటిలోగా బిల్లులు ప్రాసెస్ చేసి.. ఫిబ్రవరి 1 నాటికి జీతాలు వచ్చేలా చూడాలని ఆదేశించింది.

ఓవైపు చర్చలకు రావాలని చెబుతూనే తన పని తాను చేసుకుపోతోంది రాష్ట్ర ప్రభుత్వం. జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఆర్థిక శాఖ. మరోవైపు డిమాండ్ల సాధన కోసం ఏపీలో ఉద్యోగులు తమ ఆందోళనలు ఉధృతం చేశారు. 11వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతూ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు ఉద్యోగులు.

చర్చలకు రావాలని మంత్రుల కమిటీ ఆహ్వానించింది. అయితే పీఆర్సీ జీవోలు రద్దు చేసే వరకూ చర్చలకు వెళ్లమని స్టీరింగ్ కమిటీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే రిలే దీక్షలు ఉద్యోగులు కొనసాగిస్తున్నారు.