Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డ అభిశంసన: కేంద్రానికి లేఖ రాసిన ఏపీ ప్రభుత్వం

By:  Tupaki Desk   |   28 Jan 2021 3:01 PM GMT
నిమ్మగడ్డ అభిశంసన: కేంద్రానికి లేఖ రాసిన ఏపీ ప్రభుత్వం
X
ఏపీ పంచాయితీ ఎన్నికల ఫైట్ లో ఏపీ సీఎం జగన్ పక్షాన నిలిచి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు వ్యతిరేకంగా పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లు పనిచేశారు. ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. కోడ్ వచ్చాక ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఈ ఇద్దరు అధికారులపై అభిశంసన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వారి సర్వీస్, ప్రమోషన్లకు దెబ్బపడే ప్రమాదం నెలకొంది.

పంచాయితీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాను సవరించకపోవడాన్ని కారణంగా చూపిస్తూ నిమ్మగడ్డ ఇద్దరు అధికారులపై అభిశంసన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ చేసిన అభిశంసన ప్రొసీడింగ్స్ ను తిప్పి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఐఏఎస్ అధికారుల పట్ల ఎస్ఈసీ తీరు దారుణంగా ఉందని లేఖలో ఏపీప్రభుత్వం పేర్కొంది.

ఇద్దరు అధికారులపై నిమ్మగడ్డ అవమానకర రీతిలో లేఖ రాశారని.. వారిని తప్పనిసరిగా ఉద్యోగ విరమణ చేసేలా చూడాలంటూ లేఖరాయడం తీవ్ర ఆక్షేపణీయమని ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ఎస్ఈసీ అధికార పరిధిని మించి అభిశంసన ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని తెలిపింది. ఎస్ఈసీ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడడమేనని తెలిపింది.

ఈ ప్రొసీడింగ్స్ ను ఏపీ ప్రభుత్వం తిరస్కరించిందని లేఖలో పేర్కొంది.ఎస్ఈసీ నిమ్మగడ్డ పంపిణ ప్రొసీడింగ్స్ ను పరిగణలోకి తీసుకోవద్దని.. రాష్ట్ర అధికార పరిధిలోకి చొరబడడం సరికాదన్న విషయాన్ని ఎస్ఈసీకి తెలియజేయాలని సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.