Begin typing your search above and press return to search.

ఫ్యాన్ రెక్కలకు చుట్టుకున్న జీవో నంబర్ వన్

By:  Tupaki Desk   |   10 Jan 2023 3:43 AM GMT
ఫ్యాన్ రెక్కలకు చుట్టుకున్న జీవో నంబర్ వన్
X
ఏపీలో ఇపుడు హాట్ టాపిక్ ఏంటి అంటే జీవో నంబర్ వన్ అనే చెప్పాలి. బహిరంగ సభలు నిర్వహించే ముందు పోలీసులను సంప్రదించాల్సిందే అని ఈ జీవో స్పష్టం చేస్తోంది. అదే విధంగా ఈ జీవో ప్రకారం పబ్లిక్ కి ఆటంకం కలగచేయకుండా రోడ్ షోలను చేయకుండా మైదాన ప్రాంతాలలో సభలను నిర్వహించుకోవాలి. అలాగే జనం ఉన్న చోట్ల రద్దీ గా ఉన్న చోట్ల సభలకు నిషేధం ఉంది.

ఎక్కడ ఈ మీటింగ్ పెట్టినా కూడా ఈ జీవో ప్రకారం స్థానిక పోలీసులను సంప్రదించాలి. వారి అనుమతి తీసుకోవాలి. దీంతో విపక్షాలు ఏపీలో అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. గత నెల 28న కందుకూరులో చంద్రబాబు రోడ్ షో చేస్తే ఎనిమిది మంది మరణించారు. జనవరి 1న అదే బాబు గుంటూరులో పంచుడు కార్యక్రమం పెడితే మరో ముగ్గురు మరణించారు. దాంతో ప్రభుత్వం తెచ్చిన జీవో ఇది.

దీంతో విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది తమ సభలను అడ్డుకోవడానికి తెచ్చిన జీవో అని ఆరోపిస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి ఖూనీ లాంటి ఇలాంటి చీకటి జీవోలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పంలో మూడు రోజుల టూర్ పెట్టుకున్నారు. అయితే ఆయన సభలకు కూడా ఆటంకం కలిగించే విధంగా పోలీసులు వ్యవహరించారు అని మండిపడ్డారు.

దాంతో ఆయనని పరామర్శించడానికి ఏకంగా పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్ళి వచ్చారు. చీకటి జీవో రద్దు చేసేంతవరకూ అంతా ఏకత్రాటి మీద నిలబడాలని ఆయన కోరుకున్నారు. ఇక వామపక్షాలు బీజేపీ కూడా ఈ జీవోను తప్పుపడుతునారు. మొత్తానికి ఈ జీవో అందరి కోసం అని వైసీపీ చెబుతోంది. ఒక రాజకీయ పార్టీగా తమకు కూడా వర్తిస్తుందని అంటోంది.

ఇపుడు అదే జరిగింది. కడప జిల్లాకు చెందిన జగన్ సన్నిహిత ఎమ్మెల్యే రాయచోటికి చెందిన శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి గడప గడపకు తాను మూడు రోజుల పాటు పర్యటనలను చేస్తున్నాను అని తనకు అనుమతి కావలాని డీఎస్పీకి లేఖ ద్వారా కోరారు. శ్రీకాంత్ రెడ్డి తన నియోజకవర్గం పరిధిలోని లక్కిరెడ్డిపల్లి, దప్పేపల్లి, కోనంపేట గ్రామాల్లో గడప గడపకు పేరిట మూడు రోజుల పాటు కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నారు.

దాంతో పోలీసులు అనుమతి ఇవ్వాల్సి ఉంది అంటున్నారు. దీని మీద శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చట్టం ఎవరికైనా చట్టమే అని అన్న్నారు. స్థానిక ప్రజలకు వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా తాము గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పోలీసులను అనుమతి కోరుతున్నామని చెప్పారు.

జీవో నంబర్ వన్ అమలు లో ఉంది కాబట్టి అనుమతి తమతో పాటు ఎవరికైనా తప్పనిసరి అని ఆయన అంటున్నారు. సో ఇలా కనుక చూసుకుంటే జీవో నంబర్ వన్ ఇపుడు ఫ్యాన్ రెక్కలకే ఏకంగా చుట్టుకునేలా ఉంది అంటున్నారు. మరో వైపు చూస్తే విపక్షాలకు తెలిసేలా చేయడానికి అధికార పక్షమే చొరవ చూపి జీవో ప్రకారం నడచుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. మరి దీని మీద విపక్షాలు ఏమంటాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.