Begin typing your search above and press return to search.

అసలు పధకాలకే ఎసరు... వైసీపీకి భారీ షాకేనా...?

By:  Tupaki Desk   |   24 Jun 2022 2:30 AM GMT
అసలు పధకాలకే  ఎసరు... వైసీపీకి భారీ షాకేనా...?
X
ఏపీలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని మొదటి నుంచి అందరికీ తెలుసు. అయితే అవి జీతాలు సకాలంలో చెల్లించకపోవడానికి, రోడ్ల వంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేకపోవడానికి కారణం అవుతున్నాయని అనుకున్నారు. ఇపుడు చూస్తే మెల్లగా కధ పధకాల మీద పడగ నీడ పడేలా చేసేలా వచ్చేసింది. ఇప్పటికే జగన్ నోటి వెంట ప్రకటించిన అమ్మ ఒడి పధకానికి చిల్లు పడుతోంది. లబ్దిదారుల సంఖ్య తగ్గించేశారు అని అంటున్నారు.

దానితో పాటు మొదట పదిహేను వేలు ఇస్తే అది తరువాత పద్నాలుగు అయింది, ఇపుడు పదమూడు గా తగ్గింది. ఇలా మూడేళ్ళలో రెండు వేల రూపాయలు కోత పడింది. ఇక మరెన్ని కోతలు వాతలూ ఆ పధకానికి పడతాయో ఎవరికీ తెలియదు.

ఈ నేపధ్యంలో మరో కీలక పధకం మీద కూడా నిధుల కొరత నీలి నీడ పడింది. ఆ పధకమే దుల్హాన్ పధకం. ఇది పేద ముస్లిం యువతలు వివాహం చేసుకున్నపుడు ఇచ్చే ఆర్ధిక సాయం అన్న మాట.

ఈ పధకం వల్ల చాలా మంది పేద ముస్లిం యువతుల జీవితాలలో కాంతి రేఖ చూసే వీలుంది. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని అమలు చేయడం మానుకుంది. కారణాలు తెలియకపోవడంతో కొందరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ అసలు విషయం ప్రభుత్వం చెపేసింది. తన ఆర్ధిక నిస్సహాయతను కూడా చెప్పేసుకుంది. నిధులు లేని కారణంగానే అమలు చేయాలేకపోతున్నామని పేర్కొనడం విశేషం.

ఈ పధకం కింద గత తెలుగుదేశం ప్రభుత్వం పేద ముస్లిం యువతులకు ఆర్ధిక సాయం చేస్తూ వచ్చింది. ఈ ఒక్క పధకమే కాదు, మైనారిటీల విదేశీ విద్యా పధకానికి కూడా రాష్ట్ర సర్కార్ గండి కొట్టింది. దానికి కూడా నిధుల లేమి కారణంగా చూపించింది. వైసీపీ సర్కార్ ఏర్పడ్డాక అమలు చేయకపోవడం కాదు, 2018, 2019లలో విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించిన 574 మందికి ఇప్పటికీ సాయం అందించలేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ముస్లిం సామాజిక శక్తి తమ బలమైన ఓటు బ్యాంక్ అని చెప్పుకునే వైసీపీ తన ప్రభుత్వ హయాంలోనే వారికి సున్నా చుట్టడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. అయినా ఖజానా ఖాళీ అని చెప్పేసుకుని సర్కార్ మొత్తం గుట్టు విప్పేశాక ఈ పధకాలు కాదు ఉన్న పధకాలు ఎంతవరకూ కంటిన్యూ అవుతాయో అన్న డౌట్లు అయితే అందరిలో వస్తున్నాయి.