Begin typing your search above and press return to search.

వైసీపీకి విశాఖ షాక్

By:  Tupaki Desk   |   6 Jan 2023 4:30 PM GMT
వైసీపీకి విశాఖ షాక్
X
విశాఖపట్నం వైసీపీకి ఎపుడూ ఊరించి ఉడికిస్తూనే ఉంది. వైసీపీ పుట్టాక విశాఖ మీద కర్చీఫ్ వేయడం అన్నది జరగలేదు. 2014, 2019లలో సైతం విశాఖ సిటీ ఫ్యాన్ పార్టీని దూరం పెట్టేసింది. ఉత్తరాంధ్రా అంతటా వైసీపీ వేవ్ బలంగా వీచినా విశాఖ పొలిమేరలలో మాత్రం అది ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. జగన్ మాయాజాలాన్ని అడ్డుకుని మరీ సైకిల్ పార్టీ ఇక్కడ జోరు చేసింది.

దాంతో సీఎం అయిన దగ్గర నుంచి జగన్ విశాఖ మీదనే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కోర్టులలో మూడు రాజధానుల అంశం ఉన్నప్పటికీ విశాఖనే రాజధానిగా జగన్ భావిస్తున్నారు. హైదరాబాద్ కి ధీటైన నగరం విశాఖ అని ఆయన నమ్ముతున్నారు. ఆ దిశగా ఆయన జనాలలో సైతం భావన కల్పించి విశాఖ కోటలో పాగా వేయాలని చూస్తున్నారు.

అయితే అదంత సులువు కాదనే రాజకీయ పరిణామాలు చెబుతున్నాయి. విశాఖ పార్లమెంట్ పరిధిలో ఆరు ఎమ్మెల్యే సీట్లు ఉంటే అందులో నాలుగింటిని టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. గాజువాక, భీమిలీ సీట్లు మాత్రమే వైసీపీకి దక్కాయి. దాంతో ఈసారి మొత్తానికి మొత్తం కొట్టాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది. ఆ దిశగా తన వంతు ప్రయత్నాలను కూడా మొదలెట్టింది.

ఆపరేషన్ విశాఖ పేరిట స్పెషల్ ఫోకస్ పెట్టేసింది. విశాఖలో ఇప్పటికే మూడు నియోజకవర్గాలలో తన అభ్యర్ధులను వైసీపీ ప్రకటించేసింది. తెలుగుదేశం బలంగా ఉన్న విశాఖ సౌత్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కే టికెట్ ఇస్తారు. ఆయన రెండుసార్లు తెలుగుదేశం తరఫున గెలిచి వైసీపీలోకి జంప్ చేశారు. అక్కడ వైసీపీకి బలమైన నేత లేకపోవడం వాసుపల్లికి ప్లస్ అవుతోంది. ఆయన సామాజిక వర్గం వైసీపీకి కలసివస్తుందని ఆశిస్తున్నారు.

అయితే ఇక్కడ టీడీపీ సైతం బలమైన అభ్యర్ధిని చివరి నిముషంలో బరిలోకి దింపడం ద్వారా వైసీపీకి షాక్ ఇవ్వాలనుకుంటోంది. విశాఖ నార్త్ నుంచి చూస్తే కేకే రాజు అభ్యర్ధిగా కన్ ఫర్మ్ చేశారు. ఆయన 2019 ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడడంతో సానుభూతి కలసివస్తుందని అంచనా కడుతోంది. అయితే ఇక్కడ తెలుగుదేశం బలంగా ఉండడంతో ఎవరు అభ్యర్ధి అవుతారు అన్నది చూస్తేనే తప్ప గెలుపు సంగతి చెప్పలేరు అంటున్నారు.

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వరసగా గెలుస్తూ వస్తున్న తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబుని ఓడించడానికి విశాఖ డైరీ చైర్మన్ గా నిన్నటివరకూ ఉన్న దివంగత ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్ ని వైసీపీ పోటీ చేయించంచనుంది. సామాజికవర్గ సమీకరణలతో పాటు అంగబలం, అర్ధబలం కూడా జత కూడితే టీడీపీ మీద పై చేయి సాధించాలని చూస్తోంది.

ఇక విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీకి మరో అగ్ని పరీక్షగా మారుతోంది. ఇక్కడ మూడు సార్లు గెలిచిన సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు ఉన్నారు. ఆయన్ని ఓడించడానికి విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను బరిలోకి దింపుతారు అని అంటున్నారు. అయినా సరే ఇక్కడ వైసీపీకి చుక్కలు చూపుతామని తెలుగుదేశం గట్టిగా నమ్ముతోంది.

భీమిలీ సీటు కూడా వైసీపీకి ఈసారి కలసివచ్చే అవకాశాలు లేవు అంటున్నారు ఇక్కడ తెలుగుదేశం బాగా స్ట్రాంగ్ గా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మీద జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ భావిస్తోంది. ఆయనను తప్పించి కొత్తవారికి ఇవ్వాలని చూసినా సమర్ధుడు ఎవరు అన్నది తెలియరావడంలేదు. దాంతో భీమిలీ సైకిల్ ని అడ్డుకోవడం కష్టమే అంటున్నారు.

అదే విధంగా గాజువాక సీటు విషయం కూడా వైసీపీకి మరో టెస్ట్ గా మారబోతోంది అంటున్నారు. ఇక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే తిప్పలన నాగిరెడ్డికి సీటు రాదు అని ప్రచారం సాగుతోంది. మంత్రి గుడివాడ అమరనాధ్ పోటీ చేస్తారు అని అంటున్నా వైసీపీలో వర్గ పోరు కారణంగా తెలుగుదేశానికి అడ్వాంటేజ్ ఉంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి విశాఖ పరిధిలోని ఆరు ఎమ్మెల్యే సీట్లలో వైసీపీకి విక్టరీ అన్నది మాత్రం ప్రస్తుతానికి ఒక్కటీ కచ్చితంగా లేకపోవడం అధికార పార్టీని కలవరపెడుతోంది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.