Begin typing your search above and press return to search.

ఏపీ గవర్నర్ పై కేంద్రం అసంతృప్తి?

By:  Tupaki Desk   |   3 Jun 2020 5:05 PM GMT
ఏపీ గవర్నర్ పై కేంద్రం అసంతృప్తి?
X
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. తాము పవర్ లో లేని రాష్ట్రాల్లో గవర్నర్ల ఎంపిక విషయంలో మోడీ సర్కారు అనుసరించే వ్యూహం కాస్త భిన్నంగానే ఉంటుందని చెప్పాలి. అనవసరమైన పేచీలు పెట్టకుండా.. రచ్చ కానివ్వకుండానే పనులు పూర్తి చేసే సత్తా ఉన్న వారికే గవర్నర్ పదవులు దక్కుతాయన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. సీనియర్ బీజేపీ నేతగా సుపరిచితుడైన విశ్వభూషణ్ హరిచందన్ ఏపీ గవర్నర్ గా నియమితులైన తర్వాత.. తన తీరును పూర్తిగా మార్చుకున్నారని చెప్పాలి. చాలామంది గవర్నర్ల మాదిరి వేలెత్తి చూపించుకోవటానికి ఆయన అవకాశం ఇవ్వట్లేదు.

గవర్నర్ పదవిలో ఉన్న వారు అనుసరించే తీరును యథాతధంగా అమలు చేస్తున్న ఆయన.. ప్రభుత్వ నిర్ణయాల్ని అదే పనిగా చెక్ పెట్టే చెక్ మాస్టర్ పాత్రను పోషించటం లేదనే చెప్పాలి. ఈ విషయంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ గవర్నర్ తీరు బాగుందన్న అభిప్రాయం ఉంది. అంతేకాదు.. తన వద్దకు వచ్చే ఫైళ్లకు కొర్రీలు పెట్టే కన్నా.. ప్రభుత్వ విధానాలకు అడ్డు తగలకుండా ఎవరి పని వారిదన్నట్లుగా వ్యవహరిస్తారన్నట్లుగా ఆయన తీరు ఉందంటున్నారు. ఇదే.. ఏపీ కమలనాథులకు ఏ మాత్రం నచ్చట్లేదంటున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో రాజకీయాల్లో ఉన్న స్పేస్ ను తాము చేజిక్కించుకోవాలన్న తపన ఏపీ బీజేపీ నేతల్లో ఇటీవల మరింత పెరిగింది. దీనికి కేంద్రం నుంచి ప్రోత్సాహం లభించటంతో వారు మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారు. దీనికి నిదర్శనంగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను మారుస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంటే.. దానికి రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న విశ్వభూషణ్ హరిచందన్ ఓకే చెప్పేశారు.

ఒక రాజ్యాంగ వ్యవస్థను పరిరక్షించే ప్రక్రియలో తమ పార్టీ భాగస్వామిగా మారిందన్న సంకేతం ఏపీ ప్రజలకు ఇవ్వాలని ఏపీ కమలనాథులు డిసైడ్ అయ్యారు. ఇందుకు భిన్నంగా గవర్నర్ వ్యవహరించిన తీరుపై గుర్రుగా ఉన్నారు. తనకు తోచినట్లుగా నిర్ణయాలు ఏపీ సర్కారు తీసుకుంటే.. అందుకు గవర్నర్ వ్యవహరించటం ఏమిటన్న వాదన వినిపిస్తోంది. తాము పోరాడే అంశాలపై గవర్నర్ నిర్ణయాలు భిన్నంగా ఉండటం పై కేంద్రానికి ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలించిన కేంద్రం సైతం ఏపీ పెద్దాయన మీద గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే తమకు అందిన ఫీడ్ బ్యాక్ ను రాష్ట్ర గవర్నర్ కు పంపినట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ వాదనలో వాస్తవం ఎంతన్న విషయం అర్థమయ్యేలా పరిణామాలు ఎదురవుతాయని.. వెయిట్ అండ్ సీ అంటూ ఏపీ కమలనాథుడి నోటి నుంచి వచ్చిన ఒక మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయం మరింత రసవత్తరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.