Begin typing your search above and press return to search.

గవర్నర్ సంచలన నిర్ణయం...ఏపీ అసెంబ్లీ ప్రోరోగ్

By:  Tupaki Desk   |   13 Feb 2020 1:34 PM GMT
గవర్నర్ సంచలన నిర్ణయం...ఏపీ అసెంబ్లీ ప్రోరోగ్
X
ఏపీ అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో జగన్ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనను మరింత కాలం సాగదీద్దామనుకున్న టీడీపీ వ్యూహానికి చెక్ పడిపోగా... అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల రద్దుకు తనదైన స్పీడులో దూకుసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా శాసనమండలిని రద్దు చేసిన జగన్... మరోమారు అసెంబ్లీ సమావేశమైనా... మండలి సమావేశాలు జరగకుండా వ్యూహం రచించిన జగన్ కు గవర్నర్ నిర్ణయం చక్కని వెసులుబాటును అందించిందనే చెప్పక తప్పదు.

జగన్ సర్కారు ప్రతిపాదించిన అధికార వికేంద్రీకరణ బిల్లు - సీఆర్డీఏ రద్దు బిల్లులు చట్టంగా మారకుండా ఎలాగైనా అడ్డుకుని తీరాలన్న కసితో సాగిన టీడీపీకి బిగ్ షాకిస్తూ గురువారం సాయంత్రం గవర్నర్ ఉభయ సభలను ప్రోరోగ్ చేశారు. నిజానికి త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదని అందరూ భావించారు. కానీ ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 9వ తేదీన ప్రారంభమైన శాసనసభ సమావేశాలు కొంత బ్రేక్ తర్వాత జనవరి 20వ తేదీ నుంచి నాలుగైదు రోజుల పాటు కొనసాగాయి. జనవరిలో జరిగిన సెషన్‌ లోనే జగన్ ప్రభుత్వం ఏపీకి మూడు రాజధానులను ప్రతిపాదస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే, అసెంబ్లీలో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందగా.. కౌన్సిల్‌ కు వచ్చే సరికి ప్రభుత్వానికి చుక్కెదురైంది. టీడీపీకి వున్న ఆధిపత్యాన్ని కౌన్సిల్ వ్యూహాత్మకంగా వాడుకున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లును కౌన్సిల్ తిప్పి పంపడంతో.. అసెంబ్లీ సమావేశాలను రెండ్రోజులు పొడిగించి మరీ.. కౌన్సిల్ రద్దుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.

తాజాగా అసెంబ్లీ సమావేశాలను ప్రోరోగ్ చేయడంలో ప్రభుత్వం రెండు అంశాలలో వెసులుబాటును కలిగించుకున్నట్లయింది. ఇందులో ఒకటి.. కౌన్సిల్ తిరస్కరించిన రాజధానుల బిల్లును ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చి.. దానికి అనుగుణంగా జగన్ ప్రభుత్వం రాజధాని తరలింపుపై ముందడుగు వేసే వెసులుబాటు కలుగుతుంది. అదే సమయంలో ప్రోరోగ్ చేయకుండా ఉంటే.. త్వరలో జరిగే బడ్జెట్ సెషన్‌లో గతంలో గవర్నర్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం శాసనమండలిని కూడా సమావేశపరచాల్సి వచ్చేంది. తాజాగా ప్రోరోగ్ చేసిన నేపథ్యంలో బడ్జెట్ సెషన్ కోసం విడుదల చేసే నోటిఫికేషన్‌లో కేవలం శాసనసభ సమావేశాలను మాత్రమే నోటిఫై చేసే అవకాశం వుంది. తద్వారా మండలి మనుగడలో లేదని చాటినట్లవుతుంది. అంతేకాకుండా గవర్నర్ ప్రోరోగ్ నిర్ణయం వెనుక ప్రభుత్వం రెండు ప్రయోజనాలను పొందే పరిస్థితి కనిపిస్తోంది. మండలి రద్దును గవర్నర్ ద్వారా ఎండార్స్ చేయించడంతోపాటు.. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు వంటి విషయాల్లో ఆర్డినెన్సు జారీ చేసుకోవడం. ఇలా రెండు ప్రయోజనాలతో గవర్నర్ ప్రోరోగ్ నిర్ణయం జగన్ సర్కార్‌కు కలిసివస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఆర్డినెన్సుల కాలపరిమితి (ఆరు నెలలు) ముగిసే నాటి మండలి రద్దును పార్లమెంటు ఎండార్స్ చేస్తే.. ఇక తదుపరి సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు వంటి ఆర్డినెన్సులను బిల్లులుగా ప్రభుత్వం మార్చేసుకుంటుంది.