Begin typing your search above and press return to search.

ఏపీ కేబినెట్ నిర్ణ‌యాలు ఇవే.. కారుణ్య నియామ‌కాలు.. కిడాంబికి 5 ఎక‌రాల భూమి

By:  Tupaki Desk   |   21 Jan 2022 4:30 PM GMT
ఏపీ కేబినెట్ నిర్ణ‌యాలు ఇవే.. కారుణ్య నియామ‌కాలు.. కిడాంబికి 5 ఎక‌రాల భూమి
X
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. కరోనా నియంత్రణ, నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈబీసీ నేస్తం నిధులు, వైద్య కళాశాలల ఏర్పాటు, ఉద్యోగుల పదవీ విరమణ వయసు వంటి పలు అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

కరోనా నియంత్రణ, నివారణకు తీసుకుంటున్న చర్యలపై కేబినెట్‌ భేటీలో చర్చించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ మేరకు కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. కరోనా మరణాలు మరింత తగ్గేలా చూడాలని శాఖాధిపతులను కోరినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో, వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో దేశంలోనే మెరుగైన స్థితిలో ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అగ్రవర్ణ మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని.. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నట్టు చెప్పారు.

కొవిడ్ కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు గ్రామ వార్డు సచివాలయంలో కారుణ్య నియామకం చేపట్టేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. జగనన్న స్మార్ట్ టౌన్ లలో ఉద్యోగులకు 10 శాతం మేర స్థలాలను రిజర్వు చేయడం తో పాటు 20 శాతం మేర ధరలో రిబెటుకు ఆమోదం తెలిపారు.

పెన్షనర్ లకు కూడా 5 శాతం మేర స్థలాలు రిజర్వు చేయనున్నారు. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ 25 ఏళ్ల పాటు నిర్వహణకు సమర్థులైన సంస్థకు అప్పగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి కి 3. 90 రూపాయలు వ్యయం అవుతుంటే సమీపంలో ప్లాంట్ లో 2.6 రూపాయల ఖర్చు అవుతోందని మంత్రి అన్నారు.

ఏపీఐఐసీ నిర్వహణలోని ఖాళీ భూములు గ్రోత్ పాలసీ కింద వినియోగానికి అంగీకారాన్ని కేబినెట్ ఇచ్చింది. తిరుపతిలో కిదాంబి శ్రీకాంత్ కు 5 ఎకరాల భూమి, టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులను నియమించేలా దేవాదాయ చట్ట సవరణకు అంగీకారం తెలిపారు. ఐసీడీఎస్ లో బాలామృతం, పాల సరఫరాను ఆమూల్ కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో స్వల్ప మార్పులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రెండు వాయిదాల్లో ఓటీఎస్ సొమ్ము చెల్లించేలా వెసులుబాటు కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

జ‌గ‌న్‌ను తిడితే.. హెచ్ ఆర్ ఏ పెరుగుతుందా: మంత్రి

ఉద్యోగులు రోడ్డెక్కవద్దనే ప్రభుత్వం తాపత్రయపడుతోందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అసభ్యంగా మాట్లాడితే హెచ్ఆర్‌ఏ పెరుగుతుందా?అని ప్రశ్నించారు. ఏదైనా న్యాయంగా పోరాటం చేస్తేనే సాధించగలుగుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని నానా తిట్లు తిడుతూ.. రేపు పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.