Begin typing your search above and press return to search.

ఆ వరమిస్తే.. ఏపీ ఉద్యోగులు వైజాగ్ వెళ్లేందుకు రెఢీనట

By:  Tupaki Desk   |   20 Dec 2019 5:16 AM GMT
ఆ వరమిస్తే.. ఏపీ ఉద్యోగులు వైజాగ్ వెళ్లేందుకు రెఢీనట
X
ఏపీలోనే కాదు తెలంగాణలోనూ ఇప్పుడు ఏపీ రాజధానుల మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రాంతీయ అసమానతల్ని చెక్ పెట్టేందుకు వీలుగా ఏపీ రాష్ట్ర రాజధానుల్ని మూడు చేసే అంశాన్ని పరిశీలిస్తామని.. మూడు చేసినా చేయొచ్చంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఏపీలోని అమరావతికి సెక్రటేరియట్ మార్చిన వేళ.. ఉద్యోగుల తరలింపు కష్టంగా మారింది.

హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివెళ్లేందుకు పలువురు ఉద్యోగులు ఆసక్తిని ప్రదర్శించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వారు అమరావతిలో పని చేసేందుకు ఓకే చెప్పారు. ఇదిలా ఉంటే.. తాజాగా అమరావతి నుంచి విశాఖకు వెళ్లటమా? అన్నది ప్రశ్నగా మారింది.

హైదరాబాద్ కు విశాకకు మధ్య ప్రయాణ దూరం చాలా ఎక్కువగా ఉండటంతొ ప్రభుత్వఉద్యోగులు విశాఖ వెళ్లేందుకు ఆసక్తి చూపరన్న మాట వినిపించింది. అయితే.. అనూహ్యంగా విశాఖకు వెళ్లాల్సి వస్తే తామంతా సిద్ధమన్న మాట పలువురు ఉద్యోగుల్లో వినిపిస్తోంది.

అమరావతి నుంచి విశాఖకు వెళ్లేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కాకుంటే తమకు నివాసాల్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని వారు కోరుకుంటున్నారు. ఈ ఒక్క వరం ఇస్తే చాలు.. అమరావతి నుంచి విశాఖకు షిఫ్ట్ అయ్యేందుకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవంటున్నారు. వాస్తవానికి హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ అయినప్పుడు ఉద్యోగులకు నివాసాల ఏర్పాటు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినా నెరవేరలేదు.

అందుకు భిన్నంగా విశాఖకు రాజధానిని తరలించే వేళ.. మంత్రులతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగుల నివాసాల్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నివాసానికి సంబంధించిన వరాన్ని ప్రభుత్వం ఇస్తే.. తాము వైజాగ్ వెళ్లటానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. మరీ వరం విషయంలో జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.