Begin typing your search above and press return to search.

పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ఎన్నార్టీ చేయూత

By:  Tupaki Desk   |   27 Sep 2016 9:01 AM GMT
పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ఎన్నార్టీ చేయూత
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలోని గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో అమరావతి పరిశ్రమల సంస్థ(ఏఐఏ)కు ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఆ సంస్థ - ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీ ఎన్నార్టీ) ప్రతినిధులు పర్యటించారు. సుమారు 143 పరిశ్రమలతో ఏర్పడిన అమరావతి పరిశ్రమల సంస్థ అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ఏపీ ఎన్నార్టీ సహకరించనుంది.

వీరపనేనిగూడెంలో ఏపీఐఐసీకి కేటాయించిన 108 ఎకరాల్లో 86 ఎకరాలను ఏపీ ఎన్నార్టీకి కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో ఏఐఏ పరిశ్రమలు ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు ఏఐఏ - ఎన్‌ ఆర్‌ టీ బృందాలు ఆ భూములను సందర్శించాయి. ఈ సందర్భంగా అమరావతి ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏవీ రావ్‌ మాట్లాడుతూ.. ఏపీ ఎన్‌ ఆర్‌ టీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఔత్సాహిక ఎన్‌ ఆర్‌ ఐలకు ఇందులో ప్లాట్లు కేటాయించనున్నట్లు చెప్పారు.

ఆ స్థలంలో ఏర్పాటు చేయబోయే పరిశ్రమల కారణంగా 2500 మందికి ఉద్యోగాలు - మరో 20వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పరిశ్రమలు స్థాపించనున్నట్లు చెప్పారు ఇక్కడ ఏరోస్పేస్‌ - ఎలక్ట్రానిక్సు - సోలార్‌ - మెకానికల్‌ - ప్లాస్టిక్‌ తదితర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ పారిశ్రామికవాడ ద్వారా.. వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏపీ ఎన్‌ ఆర్‌ టీ డైరెక్టరు డాక్టర్‌ నన్నపనేని మురళీ మాట్లాడుతూ.. ప్రవాస భారతీయలు - విదేశీయుల వల్ల ఇక్కడ వ్యాపారాభివృద్ధి జరుగుతుందని - రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు ఉండటంతో ఈ ప్రాంతం అభివృద్ధి సాధిస్తుందని తెలియజేశారు. ఎన్‌ ఆర్‌ టీ డైరెక్టర్లు శేషుబాబు కన్నూరు - మురళి నన్నపనేని తదితరులు పాల్గొన్నారు. కాగా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయబోయే సంస్థలన్నీ కూడా ఇప్పటికే హైదరాబాద్ లో యూనిట్లను కలిగి ఉండడంతో భవిష్యత్తులో హైదరాబాద్ మాదిరిగానే అమరావతి కూడా అన్ని సంస్థలకు వేదికవుతుందన్న నమ్మకం ఏర్పడుతోంది.