Begin typing your search above and press return to search.

ఏపీ రాజధానికి మీరు సలహాలు ఇవ్వొచ్చు..

By:  Tupaki Desk   |   29 Oct 2019 6:42 AM GMT
ఏపీ రాజధానికి మీరు సలహాలు ఇవ్వొచ్చు..
X
ఏపీలో నిర్మించ తలపెట్టిన రాజధాని నిర్మాణంతో పాటు.. కీలకమైన ప్రాజెక్టులకు మీకు బోలెడన్ని ఆలోచనలు ఉన్నాయా? అసలు ఎలా నిర్మించాలి? ఎలా డెవలప్ చేయాలి? ఏయే అంశాల్ని ప్రాతిపదికగా తీసుకోవాలి లాంటి వాటికి సంబంధించి సలహాలు.. సూచనలు ఇవ్వాలనుకునే వారికి అద్భుత అవకాశంగా దీన్ని చెప్పాలి. ఏపీ రాజధాని నిర్మాణ కోసం ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కరు ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయటం తెలిసిందే.

నిర్మాణరంగంలో నైపుణ్యంతో పాటు.. ఒక కొత్త రాజధాని నగరాన్ని నిర్మించటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు.. శాస్త్రీయ అవగాహన ఉన్న నిఫుల్ని ఈ కమిటీలో చోటు కల్పించారు. ఈ ప్యానల్ కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి. నాగేశ్వరరావు లీడ్ చేయనున్నారు. ఏపీ రాజధానితో పాటు.. ఏపీలోని కీలకమైన ప్రాజెక్టులకు సలహాలు.. సూచనలు ఇవ్వటానికి అవకాశం కల్పిస్తున్నారు.

నేరుగా కానీ పోస్టు ద్వారా కానీ ఈమొయిల్ తోనూ సమాచారాన్ని అందించే వీలుంది. ఇలా ప్రజల నుంచి వచ్చే సూచనల్ని సేకరిస్తారు.అనంతరం వాటిని మదింపు చేసి.. అత్యుత్తమ సలహాల్ని.. సూచనల్ని పరిగణలోకి తీసుకోనున్నారు. నవంబరు 12 వరకూవినతుల్ని స్వీకరించనున్నారు.

ఈ కమిటీలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అర్కిటెక్చర్ లో ప్లానింగ్ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్న మహవీర్.. అహ్మాదాబాద్ సీపెట్ కు చెందిన ఆర్భన్ రీజనల్ ప్లానర్ శివనాంద స్వామి.. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ రవీంద్రన్.. చెన్నై రిటైర్డ్ చీఫ్ అర్బన్ ప్లానర్ అరుణాచలం సభ్యులుగా వ్యవహరించనున్నారు.

కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రభుత్వ ఆలోచనలు ఉంటాయని.. వారిచ్చే రిపోర్ట్ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని మంత్రి బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు. మరి.. ప్రభుత్వం కోరినట్లుగా కొత్త రాజధానికి ఏపీ ప్రజల నుంచి ఎలాంటి సలహాలు వస్తాయన్నది ఉత్కంటగా మారింది. మరి.. రిపోర్ట్ ఏమని ఇస్తారో చూడాలి.