Begin typing your search above and press return to search.

జగన్ మాట తప్పలేదు... సీబీఐకి ప్రీతి కేసు

By:  Tupaki Desk   |   27 Feb 2020 4:27 PM GMT
జగన్ మాట తప్పలేదు... సీబీఐకి ప్రీతి కేసు
X
వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. టీడీపీ హయాంలో సంచలనం రేకెత్తించిన సుగాలి ప్రీతి హత్యాచారం కేసును సీబీఐకి అప్పగిస్తూ గురువారం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కర్నూలు పర్యటనకు వెళ్లిన సందర్బంగా జగన్ ను కలిసిన సుగాలి ప్రీతి పేరెంట్స్... తమ కుమార్తెపై ప్రైవేట్ స్కూల్ యజమాని కుమారులు జరిపిన దురాగతాన్ని వివరించారు. అంతేకాకుండా తమ కుమార్తె మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. ఆ సందర్భంగా కేసుపై పూర్తి వివరాలను తెలుసుకున్న జగన్ అక్కడికక్కడే జిల్లా ఎస్పీతో మాట్లాడి కేసు పూర్తి వివరాలను తనకు పంపాలని కోరారు.

ఈ క్రమంలో కేసు వివరాలను కర్నూలు జిల్లా ఎస్పీ సీఎంఓకు పంపగా... జగన్ దానిపై స్టడీ చేసి కేసును సీబీఐకి అప్పగించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. జగన్ ఆదేశాలతో ప్రీతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం లేకుండానే ప్రీతి కేసును టేకప్ చేసేందుకు సీబీఐ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. మొత్తంగా పదో తరగతి చదువుతున్న ప్రీతిపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులకు కఠిన దండన అమలు కావడం తధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రీతి కేసులో నిందితులను ఎందుకు రక్షిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఈ దారుణంపై టీడీపీ అధికారంలో ఉండగా... ఏనాడూ ప్రస్తావించని పవన్... వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దీనిపై మాట్లాడుతున్న వైనం తెలిసిందే. అంతేకాకుండా జగన్ కర్నూలు పర్యటనకు ముందు... కర్నూలుకు వెళ్లిన పవన్ నానా యాగీ చేసిన వైనం కూడా తెలిసిందే. అయితే పవన్ పర్యటనకు ముందే ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కర్నూలు జిల్లా ఎస్పీ తెలిపారు. తాజాగా సీఎం హోదాలో జగన్ ఆదేశాలు జారీ ఇవ్వడంతో ఇప్పుడు ప్రీతి కేసు దర్యాప్తు సీబీఐకి బదలాయించినట్టైంది.