Begin typing your search above and press return to search.

కస్సుబుస్సులు మూణ్ణాళ్ళ ముచ్చటేనా... ?

By:  Tupaki Desk   |   10 Jan 2022 11:14 AM GMT
కస్సుబుస్సులు మూణ్ణాళ్ళ ముచ్చటేనా... ?
X
తమకు నచ్చని విషయాలను కూడా వినడం ప్రజాస్వామ్యంలో గొప్ప లక్షణం. భిన్నమైన వాదనలకు ఆస్కారం ఇవ్వడం డెమోక్రసీకి రియల్ స్పిరిట్. అయితే కాలం మారింది. అర్ధాలు కూడా మార్చేసుకుంటున్నారు. అందుకే తమకు నచ్చని వార్తలను వార్తా పత్రికలను చెవి చేరనివ్వడంలేదు. ఈ మధ్యనే వైసీపీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ తెలుగులో తమకు నచ్చని మీడియా పేర్లను లిస్ట్ తో సహా చదివి వినిపించారు. అందులో ప్రముఖ దిన పత్రిక ఈనాడు కూడా ఉంది.

ఈనాడు, ఆంధ్ర జ్యోతి, ఏబీఎన్, టీవీ 5 లను వైసీపీ నిషేధిస్తోందని చెప్పారు. ఆయా చానళ్ల డిబేట్ల‌కు తన పార్టీ ప్రతినిధులను పంపమని కూడా పేర్కొన్నారు. ఇక ఆయా పత్రికలతో వైసీపీ ఎలాంటి సంబంధాలు కొనసాగించదని చెప్పేశారు. ఇది జరిగి గట్టిగా మూడు రోజులు కూడా కాలేదు.

ఇంతలోనే ఈనాడులో అతి పెద్ద యాడ్ కనిపించి అందరి బుర్రలకు పని చెప్పింది. ఏపీ వైద్య అరోగ్య శాఖ ఈ యాడ్ ని ఈనాడు పత్రికకు ఇచ్చింది. అది మొదటి పేజీలో అర పేజీ నిడివితో అచ్చయింది. దానిని చూసిన వారు వైసీపీ చెబుతున్నదేంటి చేస్తున్నదేంటి అనుకుంటే తప్పు కాదుగా.

ఏపీలో ఆ పత్రిక ముఖం చూడమన్న వైసీపీ పెద్దలు తామే నడుపుతున్న ప్రభుత్వం ద్వారా అతి పెద్ద ప్రకటనను ఇవ్వడాన్ని వైసీపీ కార్యకర్తలు ఏ రకంగా అర్ధం చేసుకోవాలో మరి. అంటే చెప్పేవి చెబుతూంటాం, చేసేవి చేస్తూంటామని అనడమేనా దీని అర్ధం. మరి ఈనాడు పత్రికలో అన్నీ తప్పులు రాస్తున్నారని, ప్రభుత్వం మీద ఆధారం లేని వార్తలు ప్రచురిస్తున్నారని ఆరోపిస్తున్న వారు మరి ప్రభుత్వం సొమ్ముతో యాడ్ ఎలా ఇచ్చారు. అలా ఇవ్వడానికి మనసెలా వచ్చింది అని నిలదీస్తే సమాధానం ఉంటుందా.

ఆ మాత్రం సౌభాగ్యానికి నిషేధం లాంటి పెద్ద మాటలు ఎందుకు వాడాలి అన్న చర్చ కూడా వస్తోంది. మరో వైపు ఇప్పటికీ ఆంధ్రజ్యోతీ, ఏబీఎన్, టీవీ 5ల మీద నిషేధం అలాగే కొనసాగుతోంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక వాటికి ప్రభుత్వ ప్రకటనలు ఏవీ అసలు ఇవ్వడంలేదు. అంటే అక్కడ సంపూర్ణంగా నిషేధాన్ని అమలు చేస్తున్నారు అన్న మాట. మరి ఈనాడు ఏం పుణ్యం చేసిందని ఇలా చేస్తున్నారు అని మిగిలిన మీడియా అంటే జవాబు ఉందా.

ఏది చేసినా నిఖార్సుగా ఉండాలి కదా. ఇక ముందే చెప్పుకున్నట్లుగా ప్రజాస్వామ్యంలో నిషేధాలు అన్న మాటకే అర్ధం లేదు. అయినా మంత్రి కొడాలి నాని గట్టిగా ఆ మాట చెప్పారు. ఏది ఏమైనా ఇలాంటి గంభీరమైన మాటలు ఒక వైపు చెబుతూ చేతలు వేరే విధంగా ఉంటే జనాల సంగతి తరువాత సొంత పార్టీకే జవాబు ముందు చెప్పుకోవాల్సి వస్తుందేమో. ఏది ఏమైనా ప్రజాస్వామ్య ప్రియులు, మేధావులు మాత్రం ఇలాంటి నిషేధాలు ఎపుడూ కోరుకోరు అన్నది నిజం. అదే సమయంలో పాలకులు అందరినీ సమానంగా చూడాలని కూడా కోరుకుంటారు.