Begin typing your search above and press return to search.

కోర్టు లో కేసులు: దూకుడుగా జగన్..

By:  Tupaki Desk   |   3 Feb 2020 9:46 AM GMT
కోర్టు లో కేసులు: దూకుడుగా జగన్..
X
రాష్ట్ర రాజధాని తో పాటు మరో రెండు నగరాలను రాజధానిగా చేసి అధికార వికేంద్రీకరణ చేస్తానని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. అందులో భాగంగా వికేంద్రీకరణ పనులు ప్రభుత్వం ముమ్మరం చేసింది. వికేంద్రీకరణ బిల్లు తీసుకు రాగా అసెంబ్లీ, శాసన మండలిలో జరిగిన పరిణామాలతో షాక్ కు గురైన జగన్ ఎవరు ఏమి చేసినా తాను అనుకున్న పనిని చేసి చూపిస్తానని సవాల్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే మూడు రాజధానుల్లో ఒకటైన కర్నూల్ లో న్యాయపరమైన కార్యాలయాలను తరలిస్తున్నారు. మూడు రోజులుగా కార్యాలయ తరలింపు పనులు జోరుగా సాగుతున్నాయి.

కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, విజిలెన్స్ కార్యాలయాల తరలించాలని ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. అందులో భాగంగా కార్యాలయ తరలింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో పాటు విశాఖ ను పరిపాలన రాజధాని గా చేయాలన్న జగన్ నిర్ణయానికి అనుగుణంగా పనులు సాగుతున్నాయి. విశాఖపట్టణం మధురవాడలో నిర్మిస్తున్న మిలినీయం టవర్స్ పనుల్లో వేగం పెంచారు. ఈ పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం తాజాగా రూ.19.13 కోట్లు విడుదల చేసింది. మిలినీయం టవర్ బీ నిర్మాణానికి ఆ నిధులు వినియోగించనున్నారు. ఈ భవనంలోనే సచివాలయ కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే పనులు ముమ్మరం చేశారు.

అయితే ఈ ప్రయత్నాలకు అడ్డంకులు పడుతూనే ఉన్నాయి. కర్నూల్ కు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటీషన్లు దాఖలు అవుతున్నాయి. అమరవాతి నుంచి కార్యాలయాల తరలింపు ఆపాలని రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. స్టే ఆర్డర్ కోరుతూ పిటిషన్లు వేశారు. అయితే వీటిని కోర్టు స్వీకరించి విచారణ చేస్తుందా లేదా? హైకోర్టు రాజధాని ప్రక్రియపై స్టే విధిస్తుందా అనేది వేచి చూడాలి.