Begin typing your search above and press return to search.

తగ్గింపు మాట చెప్పకుండా ఈ ఎదురుదాడి ఏంది ఏపీ సర్కార్?

By:  Tupaki Desk   |   7 Nov 2021 9:30 AM GMT
తగ్గింపు మాట చెప్పకుండా ఈ ఎదురుదాడి ఏంది ఏపీ సర్కార్?
X
కింద పడినా పైచేయి అన్నట్లుగా వ్యవహరించే ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరోసారి అదే విధానాన్ని నమ్మకుంది. పెంచటమే తప్పించి తగ్గించటం అన్నది లేని రీతిలో పెట్రోల్.. డీజిల్ ధరల్ని భారీగా పెంచేసిన కేంద్రం.. తాజాగా ధరలు తగ్గేలా ఎక్సైజ్ పన్నును తగ్గించటం తెలిసిందే. లీటరు పెట్రోల్ మీద రూ.5.. లీటరు డీజిల్ మీద రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించటంతో.. ధరలు కొంతమేర తగ్గటం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తగ్గట్లే.. రాష్ట్రాలు తమ వాటాగా వచ్చే పన్నుఆదాయానికి కాస్త కోత పెట్టుకొని ధరలు మరింత తగ్గేలా నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే.

ఇప్పటికే ఇదే విధానాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు..ఒడిశా లాంటి మరికొన్ని బీజేపీయేతర రాష్ట్రాల్లోనూ ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివేళ రెండు తెలుగు రాష్ట్రాలు సైతం మిగిలిన రాష్ట్రాల మాదిరి పన్ను కోత ప్రకటనను చేయలేదు. దీంతో రాజకీయ పక్షాలు వ్యాట్ తగ్గింపుపై డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన పెట్రో ఉత్పత్తులపై పన్ను తగ్గిస్తే.. ఆదాయం తగ్గుతుంది. అదే జరిగితే మరింత ఇబ్బందికర పరిస్థితుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటాయి.

అందుకే.. వ్యాట్ తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్న విపక్ష నేతలపై ఏపీ సర్కారు ఎదరుదాడి షురూ చేసింది. పెట్రోల్ ధరల్ని పెంచాల్సినంత పెంచేసి.. ఇప్పుడు ఐదో.. పదో తగ్గించేసి దాంతో రాజకీయం చేస్తారా? అంటూ ఫైర్ అవుతోంది. సర్ ఛార్జీలు.. సెస్ ల పేరుతో చేస్తున్న వసూళ్ల కారణంగా రాష్ట్రాలకు ఆదాయంలో వాటా లేకుండా చేసిన వారే ఇప్పుడు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారంటూ బీజేపీపై విరుచుకుపడుతున్నారు.

అంతేకాదు తమ ముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం సైతం పన్నుల్ని పెంచేసి.. ఇప్పుడు మాత్రం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారని.. ఇవన్నీ కుయుక్తులుగా అభివర్ణించింది. పెట్రో ధరలపై వాస్తవ విషయాల్ని ప్రజల ముందు ఉంచుతున్నామంటూ తనదైన శైలిలో ఎదురుదాడితో కూడిన వివరణను విడుదల చేసింది. ఇదంతా చూసినప్పుడు మిగిలిన రాష్ట్రాల మాదిరి పెట్రోల్.. డీజిల్ మీద తాను వసూలు చేస్తున్న పన్ను శాతాన్ని తగ్గించే యోచన లేదన్న విషయాన్ని ఏపీ సర్కారు చెప్పేసిందన్న మాట వినిపిస్తోంది. తాజా వివరణలో ఉన్న ఆసక్తికర విషయాల్ని చూస్తే..

- ముడి చమురు ధర అంతర్జాతీయంగా తగ్గితే అందుకు తగ్గట్లు దేశీయ మార్కెట్లో ఎందుకు ధరల్ని తగ్గించలేదు?

- 2019 మేలో లీటరు పెట్రోల్ రూ.76.89 ఉంటే.. డీజిల్ రూ.71.50 ఉంటే.. ఈ ఏడాది నవంబరు నాటికి లీటరు పెట్రోల్ రూ.115.99.. లీటరు డీజిల్ రూ.108.66కు ఎలా పెరిగాయి? ఇంత భారీగా ధరల్ని ఎందుకు పెంచారు?

- పెట్రోల్.. డీజిల్ మీద కేంద్రం వసూలు చేసే మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటా కేవలం 5.8 శాతమే. నిజానికి నేరుగా పన్నుల పేరిట వసూలు చేస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. సెస్ లు.. సర్ ఛార్జీలు.. అదనపు ఎక్సైజ్ డ్యూటీ.. అదనపు ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్రం వసూలు చేసే మొత్తాల్లో రాష్ట్రానికి పైసా కూడా వాటా ఇవ్వటం లేదు.

- పెట్రో ఉత్పత్తుల అమ్మకాల మీద రూ.3.5 లక్షల కోట్లు వసూలు చేశారు. కానీ.. రాష్ట్రాలకు ఇచ్చిన వాటా మాత్రం రూ.19,475 కోట్లు.

- న్యాయంగా అయితే కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా పంచాలి. అయితే.. సెస్ లు.. సర్ ఛార్జీ రూపంలో సుమారు రూ.2.87లక్షల కోట్లను వసూలు చేశారు. రాష్ట్రాలకు మాత్రం ఇవ్వాల్సిన వాటాను ఇవ్వకుండా తగ్గించారు.

- కొవిడ్ కారణంగా ఏపీ సర్కారు రూ.30వేల కోట్ల రాబడిని కోల్పోయింది. అయినప్పటికీ ఒక్కసారి ఒక రూపాయి మాత్రమే తప్పించి.. పెట్రోల్.. డీజిల్ మీద పన్నులు పెంచలేదు.