Begin typing your search above and press return to search.

మూడుకు మూడినట్లే... ?

By:  Tupaki Desk   |   22 Nov 2021 11:36 AM GMT
మూడుకు మూడినట్లే... ?
X
మొత్తానికి జగన్ జనాభిప్రాయానికి తలవొగ్గారు. ఈ విషయంలో ఆయనకు మార్గదర్శిగా ప్రధాని నరేంద్ర మోడే ఉన్నారనే అనుకోవాలి. మోడీ ఈ మధ్యనే సాగునీటి చట్టాలను రద్దు చేసుకుంటునట్లుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చేశారు. ఇపుడు ఆయన బాటలోనే జగన్ కూడా నడిచారు . నిజానికి అమరావతి రాజధానికి మూడుగా చేసినా దానికి ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. మరో వైపు చూస్తే దాదాపుగా ఏడువందల రోజులుగా అమరావతి ఉద్యమం సాగుతోంది. దాంతో పాటు ఇటీవల స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీకి అన్ని చోట్ల మంచి ఆధిక్యం వచ్చింది కానీ అమరావతి రాజధాని ప్రభావిత జిల్లాలు అయిన ప్రకాశం జిల్లాలోని దర్శి, క్రిష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, తాటికొండ వంటి చోట్ల చేదు ఫలితాలు వచ్చాయి.

ఈ ప్రభావంతో జగన్ తన ఆలోచనలు కొంత మార్చుకున్నారని అంటున్నారు. ఇక అమరావతిని ఏకైక రాజధాని చేయకుండా మూడుగా విడగొట్టడం మీద ఆ ప్రాంత వాసులు మండిపోతూంటే విశాఖ, కర్నూల్ లను రాజధానులు చేస్తామన్నా అక్కడి ప్రజలలో కనీస మాత్రమైన స్పందన కూడా లేకపోవడం జగన్ కి ఇబ్బందిగా మారింది. ఇక అమరావతి ఉద్యమం కొన్నాళ్ళ పాటు ఉండి ఆగిపోతుంది అని అనుకున్నారు. అది సుదీర్ఘంగా సాగడంతో పాటు కేవలం వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు మద్దతు పూర్తిగా ప్రకటించాయి. దాంతో అధికార వైసీపీకి ఏం చేయాలో అసలు పాలుపోలేదని అంటున్నారు. ఇక వెనక్కి తగ్గాలని అనుకున్నా అది అవమానంగా భావించి ఇన్నాళ్ళూ ఆగారు, అయితే ప్రధాని మోడీ లాంటి వారే సాగు చట్టాల విషయంలో వెనక్కి తగ్గారు, ఈ పరిణామం కూడా జగన్ మీద బాగా పనిచేసినట్లుంది అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే మరింత మేలు అయిన తీరులో ఏపీలోని అన్ని వర్గాల ప్రజలతో చర్చలు జరిపి కొత్త బిల్లుతో అసెంబ్లీకి వస్తామని జగన్ చెప్పారు. అయితే ఇది వ్యూహాత్మక‌మైన ఎత్తుగడగానే చూడాలని అంటున్నారు. మూడు రాజధానులు అని ఊరించి చివరికి అమరావతికే జగన్ కట్టుబడిపోతే విశాఖ, కర్నూల్ లలో ఎంతో కొంత ఉద్యమం చెలరేగినా దాన్ని విపక్షాలు అవకాశంగా తీసుకుంటాయన్న ఆలోచనతోనే తెలివిగా ఇంకా మూడు మూడ్ నుంచి వెనక్కి పోలేదు అని చెప్పడమే తప్ప మరోటి కాదు అంటున్నారు. మొత్తానికి ఇక్కడ ఒక విషయం స్పష్టం. మూడు రాజధానుల చట్టం రద్దు అయింది. కొత్తగా బిల్లు పెట్టి అది చట్టం అయ్యేసరికి చాలా కాలమే పడుతుంది. మరో రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి. కాబట్టి జగన్ ప్రస్తుత జమానాలో మూడు రాజధానుల ప్రసక్తి ఉండకపోవచ్చు అన్నదే విశ్లేషణగా ఉంది మరి.