Begin typing your search above and press return to search.

తేల్చుకోవటానికే ప్రభుత్వం సిద్దమైందా ?

By:  Tupaki Desk   |   6 March 2022 10:30 AM GMT
తేల్చుకోవటానికే ప్రభుత్వం సిద్దమైందా ?
X
రాజదాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుతో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విభేదిస్తోంది. కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి అసంబద్ధంగా ఉందని మంత్రులు, అధికారపార్టీలు మండిపడుతున్నారు. కోర్టు తీర్పు యధాతధంగా అమలు చేసేది లేదన్నట్లుగానే మంత్రులు చెప్పేస్తున్నారు. కోర్టు తీర్పులో ఏమి చెప్పినా మూడు రాజధానుల విదానం ప్రకారమే తాము ముందుకెళతామని మంత్రులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.

తాజగా కోర్టు తీర్పుపై శాసనసభలో చర్చిస్తామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో చెప్పటం సంచలనంగా మారింది. కోర్టు తీర్పుపై శాసనసభలో చర్చించిన దాఖలాలు గతంలో బహుశా జరగలేదేమో. అమరావతి విషయంలో కోర్టు తీర్పు ఏ పద్దతిలో చూసినా అమలు సాధ్యంకాదు. నెలరోజుల్లో మౌళికసదుపాయాలు కల్పించటం సాధ్యంకాదు.మూడునెలల్లో ప్లాట్లను డెవలప్ చేసి రైతులకు ఇచ్చే అవకాశమేలేదు.

అలాగే ఆరుమాసాల్లో రాజధాని నిర్మాణం చేసే అవకాశం అంతకన్నా లేదు. కోర్టు చెప్పినట్లు ఇవన్నీ మొత్తం ఆరుమాసాల్లో చేసేయగలిగితే చంద్రబాబునాయుడే చేసుండేవారు. కానీ ఎందుకు చేయలేకపోయారు ? ఎందుకంటే జరిగేపనికాదు కాబట్టే. మొదటిదశ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు అవసరమని స్వయంగా చంద్రబాబే లెక్కేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తీర్పు ఒకపద్దతి అయితే రాజధానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్రప్రభుత్వానికి, శాసనసభకు లేదని కోర్టు చెప్పటాన్నే అధికారపార్టీ తప్పుపడుతోంది. ఈ తీర్పుపైనే అసెంబ్లీలో చర్చిస్తామని చీఫ్ విప్ చెప్పారు.

అలాగే న్యాయవ్యవస్ధ పరిధి, అధికారాల పైన కూడా అసెంబ్లీలో చర్చజరగాలని సీనియర్ ఎంఎల్ఏ ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రికి లేఖ రాయటం ఆసక్తిగా మారింది. ఈ నేపధ్యంలోనే హైకోర్టు పనితీరు విషయాన్ని కూడా అసెంబ్లీ సమగ్రంగా చర్చించబోతోందనే సంకేతాలు కనబడుతున్నాయి. మొత్తంమీద కోర్టుతో అధికారపార్టీ తేల్చుకోవటానికే సిద్ధమైందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.