Begin typing your search above and press return to search.

ఆ పేరుకు రాజ‌ముద్ర !

By:  Tupaki Desk   |   3 Aug 2022 8:33 AM GMT
ఆ పేరుకు రాజ‌ముద్ర !
X
ఎట్టకేల‌కు అనేక వివాదాలు దాటుకుని కోన‌సీమ జిల్లా బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా పేరును స్థిరం చేస్తూ ఏపీ స‌ర్కారు రాజ‌ముద్ర వేసింది.దీంతో ఇక‌పై అధికారిక కార్య‌క‌లాపాల్లో కోన‌సీమ జిల్లా పేరును బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగానే వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. దీంతో అంబేద్క‌ర్ వాదంతో అదేవిధంగా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఏకీభ‌వించిన వ‌ర్గాల‌న్నీ ఇవాళ ఆనందాల‌ను వ్య‌క్తం చేస్తూ ఉన్నాయి.

ప్ర‌భుత్వం ఇవాళ తీసుకున్న నిర్ణ‌యం, అదేవిధంగా పేరు మార్పుపై అనేక విభేదాలు, విభిన్న వాద‌న‌లూ వ‌చ్చినా కూడా వెన‌క్కు త‌గ్గ‌ని నైజంపై సానుకూల‌త వ్య‌క్తం అవుతోంది.

ఇదే స‌మ‌యాన ఆరోజు గొడ‌వ‌ల‌కు కార‌ణం అయిన వారిని క‌ఠినంగా శిక్షించాల‌న్న డిమాండ్ ఒక‌టి మళ్లీ మ‌ళ్లీ వినిపిస్తోంది. తొలుత కోన‌సీమ జిల్లాకు జీఎంసీ బాల‌యోగి పేరు పెట్టాల‌న్న ప్ర‌తిపాద‌న కూడా వ‌చ్చింది. అయితే దివంగ‌త స్పీక‌ర్ పేరు క‌న్నా బీఆర్ అంబేద్క‌ర్ పేరు అయితేనే బాగుంటుంద‌ని వైసీపీ స‌ర్కారు భావించింది.

ఇందులోభాగంగానే మే 18న ప్రాథ‌మిక నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా, త‌రువాత అభిప్రాయాలు తీసుకునేందుకు నెల రోజులు గ‌డువు ఇచ్చింది. త‌రువాత ప‌రిణామాల నేప‌థ్యంలో కొంద‌రు యువ‌కులు వాట్సాప్ గ్రూపుల ద్వారా భావోద్వేగాలు రెచ్చ‌గొట్టి ప్ర‌శాంత కోన‌సీమ‌లో అల్ల‌ర్లు రేపారు. ఈ ఘ‌ట‌న‌ల్లో ప్ర‌జా ప్ర‌తినిధుల ఇళ్లు కూడా దగ్ధం అయ్యాయి. ఇదే సంఘ‌ట‌న‌కు సంబంధించి పార్టీలక‌తీతంగా కొంద‌రు పాల్గొన్నాక, విధ్వంస రచ‌న సాగించార‌న్న అభియోగాలు కూడా న‌మోదు అయ్యాయి. ఆఖ‌రికి కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశ‌ల్ రాక‌తో గొడ‌వ‌లు కాస్త స‌ర్దుమ‌ణిగాయి.

గొడ‌వ‌ల నేప‌థ్యంలోనే నెల రోజుల పాటు ఇంట‌ర్నెట్ సేవ‌లు సైతం ప‌లు మండ‌లాల‌కు నిలిచిపోయాయి. ప‌రిస్థితి తీవ్ర‌త రీత్యా ఒక్కొక్క ప్రాంతానికి సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ చేశారు.

ఈ ఘ‌ట‌న‌ల్లో భారీ స్థాయి ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. నాటి ప‌రిణామాల అనంత‌రం రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ప‌లు వివాదాలు క‌నిపించాయి.అటుపై అవి కాస్త స‌ద్దుమ‌ణిగాయి. తాజాగా కోన‌సీమ జిల్లా పేరును మ‌హ‌నీయుడు బీఆర్ అంబేద్క‌ర్ పేరును క‌లుపుతూ స్థిరం చేయ‌డంతో ఇక‌పై అధికారికంగా ఈ జిల్లా పేరు మ‌రింత విస్తృతిలోకి రానుంది.