Begin typing your search above and press return to search.

కత్తి మహేష్ మృతిపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం?

By:  Tupaki Desk   |   14 July 2021 9:30 AM GMT
కత్తి మహేష్ మృతిపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం?
X
ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరణం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఆయన చికిత్స పొందుతూ బాగు అవుతున్నాడని వార్తలు వచ్చిన వేళ సడెన్ గా మరణించడం సంచలనమైంది. సోమవారం చిత్తూరు జిల్లాలోని కత్తి మహేష్ స్వగ్రామం లో అంత్యక్రియలు ముగించారు. దీనికి హాజరైన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తాజాగా కత్తి మహేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కత్తి మహేష్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మందక్రిష్ణ మాట్లాడుతూ 'విజయవాడ నుంచి కత్తి మహేష్ ఆ రోజు రాత్రి 12 గంటలకు బయలు దేరాడు. నెల్లూరుకు 13 కి.మీల దూరంలో యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ సీటులో సురేష్ అనే సోదరుడు, పక్క సీటులో కత్తి మహేష్ కూర్చున్నారు. మహేష్ కూర్చున్న కుడివైపే ప్రమాదం జరిగింది. ఆ పక్కనే కూర్చున్న సురేష్ కు ఏ చిన్న గాయం తగలకుండా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇక కత్తి మహేష్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏదీ లేదని ఆయన మామ, బంధువులు నాతో ఫోన్లో చెప్పారు. వైద్యులు కూడా ఒక కన్ను తీసేసయాల్సి వస్తుందని.. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. మరో 3, 4 రోజుల్లో మహేష్ ను డిశ్చార్జి చేస్తామన్నారు’ అని మందక్రిష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కత్తి మహేష్ మరణానికి కేవలం ఐదు నిమిషాల ముందు సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారని మందక్రిష్ణ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చనిపోయారని చెప్పారన్నారు. ఈ సందర్భంగా ఆ ఆస్పత్రిలో కత్తి మహేష్ కు అందించిన చికిత్స వివరాలను వెల్లడించాలని మందక్రిష్ణ డిమాండ్ చేశారు. ఆయన మరణంలో అన్ని వాస్తవాలు వెలుగుచూడాలన్నారు.

కత్తి మహేష్ కు చాలా మంది శత్రువులు ఉన్నారని.. గతంలోనూ ఆయనపై అనేక దాడులు జరిగాయని మందక్రిష్ణ గుర్తు చేశారు. ఈ ఉదంతంపై లోతుగా దర్యాప్తు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

మందక్రిష్ణ డిమాండ్ పై స్పందించిన ఏపీ ప్రభుత్వం కత్తి మహేష్ మరణంపై విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహేష్ కారు డ్రైవర్ సురేష్ ను విచారణకు పిలిచారు.

ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన తీరు, కత్తి మహేష్ తీవ్రంగా గాయపడితే డ్రైవర్ సురేష్ కు ఎందుకు చిన్నగాయం కూడా కాలేదన్నదానిపై విచారణ జరిపారని తెలిసింది. ప్రమాదం తర్వాత ఏం జరిగిందన్న దానిపై పోలీసులు ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అయితే కత్తి మహేష్ విచారణపై పోలీసులు అదికారికంగా స్పందించలేదు. దీనిపై ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలుస్తోంది.

మరోవైపు కత్తి మహేష్ మృతిపై తమకూ అనుమానాలున్నాయని ఆయన తండ్రి ఓబులేష్ పేర్కొన్నారు. మహేష్ చనిపోయిన విషయాన్ని తమకంటే ముందే బయటకు చెప్పారని ఆయన ఆరోపించారు. మహేష్ మృతిపై న్యాయవిచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని కోరారు.

కత్తి మహేష్ తెలుగు నాట సినీ విమర్శకుడిగా పాపులర్ అయ్యారు. అనంతరం పలు సినిమాల్లోనూ నటించాడు. గత కొంతకాలంగా జనసేన, టీడీపీలను విమర్శిస్తూ వైసీపీకి మద్దతుగా కత్తి మహేష్ రాజకీయం చేశారు. పలు వైసీపీ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కత్తి మహేష్ కు ఏపీ ప్రభుత్వం ఈ సాయం చేసింది. కత్తి మహేష్ వైద్య ఖర్చుల కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి 'సీఎంఆర్ఎఫ్’ కింద రూ.17 లక్షలను విడుదల చేసింది. ఈ మేరకు సీఎం స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.