Begin typing your search above and press return to search.

ఆయ‌న వెల్‌ కంకు ఎంత భారీ ఏర్పాట్లంటే..!

By:  Tupaki Desk   |   26 Aug 2017 4:16 AM GMT
ఆయ‌న వెల్‌ కంకు ఎంత భారీ ఏర్పాట్లంటే..!
X
ఒక‌రి స్వాగ‌తం కోసం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌ర్కారు చేస్తున్న ఏర్పాట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉప రాష్ట్రప‌తిగా వెంక‌య్య‌నాయుడు బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలిసారి సొంత రాష్ట్రానికి వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు భారీ స్వాగ‌త స‌త్కారాలు చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఘ‌న స్వాగ‌తానికి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉప రాష్ట్రప‌తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు పౌర‌ స‌న్మానం చేయ‌నున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా చేస్తున్న ఏర్పాట్లు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఢిల్లీ నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్‌ కు వ‌స్తున్న ఉప రాష్ట్రప‌తికి స్వాగ‌తం ప‌లికేందుకు ల‌క్ష మందితో భారీ మాన‌వ‌హారాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ నుంచి ప్ర‌కాశం బ్యారేజీ వ‌ర‌కూ భారీ మాన‌వ‌హారంతో వెల్ కం చెప్ప‌నున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మాన‌వ హారం సంద‌ర్భంగా వెంక‌య్య‌కు పూలు జ‌ల్లి స్వాగ‌తం ప‌ల‌కున్నారు. దాదాపు 23 కిలోమీట‌ర్ల దూరం ఉన్న ఈ మాన‌వ‌హారంలో సుమారు ల‌క్ష‌మంది స్వాగ‌త ఏర్పాట్ల‌లో పాలు పంచుకోనున్నారు. ఈ కార్య‌క్ర‌మం కోసం భారీ ఎత్తున రాక‌పోక‌ల‌పై పోలీసులు ఆంక్ష‌లు విధించారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప‌టిష్ట‌మైన బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌నున్నారు.

ర్యాలీ ముగిసే వ‌ర‌కూ ఎలాంటి వాహ‌నాల్ని స్వాగ‌తం ప‌లికే ప్రాంతం నుంచి వెళ్ల‌కుండా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయ‌నున్నారు.

ఈ ర్యాలీ కోసం వివిధ జిల్లాల నుంచి వ‌చ్చే మార్గాల్ని క్లోజ్ చేసేసి.. ప్ర‌త్యామ్నాయ ర‌హ‌దారుల గుండా ట్రాఫిక్‌ ను మ‌ళ్లించ‌నున్నారు. ఈ ర్యాలీ కార‌ణంగా చెన్నై.. కోల్ క‌తా జాతీయ ర‌హ‌దారి స‌హా బెంజి స‌ర్కిల్‌.. బంద‌ర్ రోడ్డు మీదుగా బ్యారేజ్ వ‌ర‌కూ ట్రాఫిక్ మీద ఆంక్ష‌లు విధించ‌నున్నారు. మ‌రి.. ర్యాలీకి అవ‌స‌ర‌మైన ల‌క్ష మందిని ఎక్క‌డ నుంచి తీసుకొస్తున్నార‌న్న విష‌యానికి వెళితే.. 70 వేల మంది విద్యార్థుల్ని వివిధ పాఠ‌శాల‌ల నుంచి.. క‌ళాశాల‌ల నుంచి.. మ‌రో 30 వేల మందిని డ్వాక్రా సంఘాల నుంచి త‌ర‌లించేలా ఏర్పాట్లు చేయ‌టం గ‌మ‌నార్హం.