Begin typing your search above and press return to search.

అమరావతి భూములపై సుప్రీంకు ఏపీ సర్కార్ !

By:  Tupaki Desk   |   29 Jun 2021 11:30 AM GMT
అమరావతి  భూములపై  సుప్రీంకు ఏపీ సర్కార్ !
X
ఆంధ్రప్రదేశ్ లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతిలో రాజధాని పేరుతో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ఆరోపణలు చేస్తూ వచ్చేది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ ఇన్ సైడర్ ట్రేడింగ్ పై దర్యాప్తు చేయించింది. అదే సమయంలో సిట్ ఏర్పాటు, ఇన్ సైడర్ ట్రేడింగ్ దర్యాప్తుపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. అమరావతిలో టీడీపీ నేతలతో పాటు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్ములపాటి శ్రీనివాస్ కూడా అక్రమంగా భూములు కొనగోలు చేయడం ద్వారా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది.

దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. దీనితో హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, అదనపు సమాచారం ఇచ్చేందుకు సమయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టును సమయం కోరారు. దీనితో విచారణ మూడు వారాల పాటు వాయిదా పడింది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ సర్కార్ తమపై అక్రమ కేసులు పెట్టిందంటూ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇన్ సైడర్ ట్రేడింగ్ పదాన్ని అమరావతి భూముల కొనుగోళ్లకు ఎలా వర్తింపచేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో వాడే పదమని తెలిపింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో అమరావతి భూముల కొనుగోళ్లపై దర్యాప్తు చెల్లదని ప్రకటించింది. సిట్ ఏర్పాటుతో పాటు అమరావతిలో దర్యాప్తుపైనా స్టే విధించింది. ఆ విషయం పైనే ఇప్పుడు ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది.