Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలూ ప్యాకేజ్ స్టార్ లేనా...?

By:  Tupaki Desk   |   20 Oct 2022 5:17 AM GMT
ఎమ్మెల్యేలూ ప్యాకేజ్ స్టార్ లేనా...?
X
రాజకీయం అంటేనే సర్వం ప్యాకేజిమయం. పై నుంచి దిగువ దాకా ప్యాకేజీని సర్దుబాటు చేసుకుంటేనే సక్సెస్ పలకరిస్తుంది. ఇది సీనియర్ పొలిటిషియన్స్ అందరికీ తెలిసిన సత్యమే. ఈ రోజుల్లో ధనమూలంగానే రాజకీయం తయారైంది. దాంతో ఎక్కడ ఎవరైనా డబ్బులు తీస్తేనే కధ ముందుకు సాగుతోంది. ఇపుడు విషయానికి వస్తే ఏపీ రాజకీయాల్లో ప్యాకేజీ స్టార్ అన్న విమర్శలు ఎక్కువ అయ్యాయి. అవన్నీ కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ మీదనే చేస్తున్నారు. అధికార పార్టీ వారు పనిగట్టుకుని మరీ ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు.

ఆయన టీడీపీతో ప్యాకేజ్ డీల్ కుదుర్చుకుని రాజకీయాలు చేస్తున్నారు అన్నదే వైసీపీ నేతల ఆరోపణ. పవన్ ఈ విధంగా చేయడాన్నే ప్యాకేజి అని తప్పు పడితే అసలు రాజకీయం మొత్తం ప్యాకేజ్ మయం కదా ఆ విధంగా లెక్క తీస్తే అందరూ ప్యాకేజ్ స్టార్లు అవుతారు కదా అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఇది పెద్ద స్టేట్మెంట్ అనుకుంటే అనుకోవచ్చు కానీ ఏపీ తెలంగాణాలలో ఎన్నికల వేళ ప్రతీ ఎమ్మెల్యే అభ్యర్ధికి ఫండ్స్ ఏరో ఒక రూపంలో ఎక్కడ నుంచో వస్తాయని ప్రచారంలో ఉన్న విషయమే కదా. ఆ విధంగా ఫండ్స్ తీసుకుని పనిచేసే వారు ప్యాకేజ్ స్టార్ట్స్ గా ముద్ర పడరా అన్నది జనాలకు కలుగుతున్న ధర్మ సందేహం అంటున్నారు. నిజానికి ప్యాకేజీ స్టార్స్ గానే ఇపుడు రాజకీయాల్లో చాలా మంది కనిపిస్తున్నారు.

ఎక్కడో ఎవరో డబ్బులు విదిలించకుండా రాజకీయం చేయాలనుకుంటున్నారు తప్ప నూటికి నూరు శాతం రాజకీయం డబ్బుమయం అయిపోయింది అన్నది తెలిసిందే. ఇక్కడ ఎవరూ సుద్ధ పూసలు కారనే అంతా అంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో అభ్యర్ధులకు వచ్చిన ఫండ్స్ తో వారు ప్రజలకు ఓట్లు కోసం ఖర్చు పెడుతున్నారు. అంటే ప్రజలకు ఓటుకి ఇంత అని చెప్పి నోట్లు ఇచ్చి రాజకీయం చేసుకుంటున్నారు. మరి ప్రజలు ఆ డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారు.

నిజానికి చాలా కాలంగా చూస్తే ఓటుకు నోటు తీసుకోకుండా వేసే వారు గతంలో పోలిస్తే బాగా తగ్గిపోయారని సర్వేలు చెబుతున్నాయి. మాకేంటి చేశారు అన్న దాని కంటే ఈ రోజుకు తృణమో ఫణమో దక్కింది కదా అని ఇచ్చిన దాన్ని పుచ్చేసుకుంటున్నారు. అలా ఓట్లేస్తున్నారు. అది ఒక విధంగా చూస్తే అది కూడా ప్యాకేజ్ డీలే కదా అని అన్న వారూ ఉన్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే కాదేదీ ప్యాకేజీకు అనర్హం అన్నట్లుగా ఇపుడు రాజకీయాలలో కధ సాగుతోంది. ఏమైనా డౌట్లు ఉంటే తాజాగా తెలంగాణాలో జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికను ఒక్కసారి చూస్తే చాలు అర్ధమవుతుంది అంటున్నారు. అక్కడ తులం బంగారం కూడా ఇంటింటికీ ఇస్తున్నారు అన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. మరి ఆ విధంగా తీసుకుని ఓటేసే వారంతా ప్యాకేజీ స్టార్లే కదా అంటే జవాబు ఉంటుందా.

సో రాజకీయాల్లో అవినీతికి పూర్తిగా నిర్మూలించలేని ఈ పరిస్థితులలో అంతా డబ్బుతో సాగుతున్న వ్యవస్థలో ఉంటూ తాము మాత్రమే నీతిమంతులమని చెప్పుకుంటూ ఎదుట వారి మీద బురద వేసే వారే ప్యాకేజీ స్టార్స్ అంటూ విమర్శలు చేస్తారని అంటున్నారు. వీలైనంతవరకూ ఇలాంటి విమర్శలకు చెక్ పెడితేనే ఎవరి మర్యాద వారికి దక్కుతుంది అని కూడా అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.