Begin typing your search above and press return to search.

పవన్ : రగులుతున్న అగ్ని పర్వతం

By:  Tupaki Desk   |   18 Oct 2022 9:22 AM GMT
పవన్ : రగులుతున్న అగ్ని పర్వతం
X
పవన్ కళ్యాణ్ ఇపుడు రగులుతున్న అగ్ని పర్వతంగా చెప్పుకోవాలి. ఆయన సాధారణంగా తన పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ అధికార వైసీపీ మీద విమర్శలు చేస్తూ అలా సాగిపోయేవారు. అయితే ఆయన రాజకీయ జీవితంలో ఫస్ట్ టైం ఒక హొటల్ గదిలో ఉంచి బయటకు రావద్దు అంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఇక పవన్ కళ్ళముందే వందల మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి పారేశారు.

పవన్ ర్యాలీ మీద కూడా కండిషన్లు పెట్టారు. మొత్తానికి విశాఖ టూర్ లో పవన్ కి కొత్త అనుభవాలు ఎదురయ్యాయి. వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో పవన్ చాలా సార్లు జగన్ మీద ఘాటు విమర్శలు ఎన్నో చేశారు. కానీ ఎపుడూ జనసేన వైపుగా కూడా ప్రభుత్వం గట్టిగా ఫోకస్ పెట్టింది లేదు. ఆయన విమర్శలకు వైసీపె మంత్రులు ప్రతి విమర్శలు చేసేవారు. అక్కడితో ఆ ఎపిసోడ్ అలా ఎండ్ అయ్యేది.

కానీ విశాఖలో ఈసారి పవన్ టూర్ మాత్రం ఏపీ రాజకీయాల్లో కూడా కీలకంగా మారింది. ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీనే కట్టడి చేస్తూ వచ్చిన అధికార పార్టీ ఇపుడు జనసేన మీద కూడా తన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ టీడీపీతో మాత్రమే కాదు జనసేనతో కూడా అన్న ఎరుక ఉండడం వల్లనే ఇలా చేశారని అంటున్నారు. పైగా జనసేన గ్రాఫ్ కూడా గతంతో పోలిస్తే బాగా పెరిగింది అన్న లెక్కలు కూడా అధికార పార్టీ వద్ద ఉండడం వల్లనే జనసేనను కట్టడి చేసేందుకు సిద్ధమయ్యారు అని అంటున్నారు.

దానికి విశాఖ ఎయిర్ పోర్టు ఘటన కూడా కలసి వచ్చింది. దాంతో వైసీపీ నుంచి పదునైన షాక్ జనసేనకు ఫస్ట్ టైం తగిలింది. ఇప్పటిదాకా చూస్తే పవన్ కి క్యాడర్ పూర్తిగా సహకరించింది. ఫ్యాన్స్ నుంచి టర్న్ అయిన క్యాడర్ పవన్ కోసం ఎంతైనా చేసేందుకు సిద్ధంగా ఉంది. దాంతో వారు కూడా పవన్ నుంచి ఏమీ కోరలేదు. కానీ మొదటిసారి క్యాడర్ కేసులలో చిక్కుకుంది. వారికి కాపాడుకోవాల్సిన అగత్యం, అవసరం కూడా జనసేన మీద పడింది.

ఇది కొత్త అనుభవమే. అంతే కాదు జనసేన నాయకత్వానికి ఇది ఒక గట్టి పరీక్షగా కూడా ఉందిపుడు. తెలుగుదేశంలో బడా నాయకుల మీద కేసులు పడినా వారిని బెయిల్ మీదన విడిపించుకునే పరిస్థితి ఆ పార్టీలో ఉంది. అలాగే పోరాటాలు చేస్తూ టీడీపీ వైసీపీకి గట్టి బదులు ఇస్తోంది. ఇపుడు జనసేనకు ఈ పరిస్థితి వచ్చింది. దాంతో జనసేనాని కూడా ఇంకా గట్టిగానే రిటార్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి.

తన పార్టీకి అండగా ఉంటున్న పార్టీ వారిని కాపాడుకోకపోతే వారి మీద కేసులు పెడితే బెయిల్ ఇప్పించుకుని న్యాయపరమైన రక్షణ కల్పించకపోతే డీ మోరలైజ్ అవుతారు. ఒక విధంగా ఇది జనసేనకు కత్తి మీద సాము లాంటి వ్యవహారం. దాంతో ఇపుడు ఆ పార్టీ కిందా మీదా అవుతోంది. పార్టీ జనాలు రావడం మాట్లాడడం, వెళ్ళిపోవడం వేరు. పార్టీ కోసం క్యాడర్ కదం తొక్కితే అవి ఒక్కోసారి హద్దులు దాటితే వారి మీద పడే కేసులను కూడా పార్టీ పట్టించుకుని అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వాల్సి ఉంది.

అలా కనుక ఇవ్వకపోతే రేపటి రోజున అదే జనసేనకు ఇబ్బందిగా మారుతుంది. సరిగ్గా ఇలాంటి వ్యూహంతోనే పవన్ లోని నాయకత్వ పటిమకు సవాల్ విసిరినట్లుగానే వైసీపీ వ్యూహాత్మకంగా ఈ యాక్షన్ లోకి దిగింది అంటున్నారు. ఒక విధంగా ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. ఇదివరకు మాదిరిగా ఆవేశపూరితమైన ప్రసంగాలు చేసి పవన్ వెళ్ళిపోయే సీన్ ఉండదు, పార్టీ క్యాడర్ కూడా ఇబ్బందులు చేస్తే వారి వైపు నుంచి ఏ చిన్న తప్పు జరిగినా కట్టడి చేసేందుకు రెడీ అన్నట్లుగానే వైసీపీ ఉందని స్పష్టం అవుతోంది.

ఒక విధంగా ఈ పరిణామాలు పవన్ ని ఆలోచనలో పడేసాయనే అంటున్నారు. గతంలో ఈ అనుభవం లేకపోవడం వల్లనే కొంత తడబాటుకు గురి అయినా ఇపుడు న్యాయపోరాటం దిశగా జనసేన గట్టిగానే అడుగులు వేస్తోంది. ఇక జనసేనకు కూడా తెలుసు. ఇది ఇక్కడితో ఆగదని. అందుకే పవన్ యుద్ధం అంటున్నారు. ఒక విధంగా యుద్ధంలోకి ఎంటర్ అయ్యారు. ఇపుడు ఏ వైపు నుంచి సవాల్ ఎదురైనా పవన్ సహా క్యాడర్ మొత్తం అలెర్ట్ అయి గట్టిగా రియాక్ట్ కావాల్సి ఉంది.

ఏది ఏమైనా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు మాత్రం పవన్ లోని రగులుతున్న అగ్నిపర్వతంగా మర్చేశాయని అంటున్నారు. దీని వల్ల జనసేన రాజకీయంగా మరింతగా రాటుదేలవచ్చు. ఆ తరువాత ఏపీలో రాజకీయ యుద్ధం కూడా ఇంకా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.