Begin typing your search above and press return to search.

షాకింగ్‌.. ఒకే రోజు రెండు కేసుల్లో పిటిషనర్లకు ఏపీ హైకోర్టు జరిమానా!

By:  Tupaki Desk   |   25 Nov 2022 7:30 AM GMT
షాకింగ్‌.. ఒకే రోజు రెండు కేసుల్లో పిటిషనర్లకు ఏపీ హైకోర్టు జరిమానా!
X
ఏపీ హైకోర్టు నవంబర్‌ 24న రెండు కేసుల్లో సంచలన తీర్పు ఇచ్చింది. ఈ రెండు కేసుల్లోనూ పిటిషనర్లకు కోర్టు జరిమానా విధించడం గమనార్హం. ఈ రెండింటిలో ఒకటి ఇళ్ల కూల్చివేతల సందర్భంగా రాష్ట్రంలోనే పాపులరైన ఇప్పటం గ్రామస్తులు వేసిన పిటిషన్‌ కాగా, మరొకటి తూర్పుగోదావరి జిల్లాలోని మర్రిపూడి గ్రామస్తులు వేసిన పిటిషన్‌.

ఈ రెండు పిటిష ల్లోనూ పిటిషనర్లదే తప్పు ఉందని భావించిన న్యాయస్థానం వారికి జరిమానా విధించింది. కోర్టును తప్పుదోవపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమించి వదిలివేయాలని పిటిషనర్లు తరపు న్యాయవాదులు కోరినా న్యాయస్థానం అంగీకరించలేదు. కోర్టులంటే అంత చులకనగా ఉందా అని వ్యాఖ్యానించింది. ఒకసారి జరిమానా విధిస్తే రెండోసారి కోర్టులను తప్పుదోవ పట్టించకుండా జాగ్రత్తగా ఉంటారని తెలిపింది.

ఈ నేపథ్యంలో ఇప్పటం గ్రామంలో తమ ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి అధికారులకు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని గ్రామస్తులు వేసిన పిటిషన్‌ అసత్యమని కోర్టు నిర్ధారించింది. అధికారులు ఇళ్ల కూల్చివేతలకు ముందే గ్రామస్తులకు నోటీసులు ఇచ్చారని వెల్లడి కావడంతో పిటిషన్‌ దాఖలు చేసిన 14 మంది గ్రామస్తులకు జరిమానా విధించింది. ఒక్కొక్కరిని లక్ష రూపాయల చొప్పున కట్టాలంటూ ఆదేశాలు ఇచ్చింది.

అలాగే తూర్పుగోదావరి జిల్లా మర్రిపూడిలో బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ ఏర్పాటుపై ముగ్గురు వ్యక్తులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇదే అంశంపై పిటిషనర్లు ఇప్పటికే సింగిల్‌ జడ్జి ముందు పిటిషన్‌ వేశారని.. ఈ విషయాన్ని కప్పిపుచ్చి మళ్లీ పిల్‌ రూపంలో హైకోర్టులో మరో పిటిషన్‌ వేశారని.. ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేసిన విషయాన్ని పిల్‌లో పేర్కొనలేదని కాలుష్య నియంత్రణ మండలి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమేనన్నారు. దీంతో కోర్టు పిటిషన్‌ వేసిన ముగ్గురికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించింది.

బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ ఏర్పాటు కాకుండా అడ్డుకోవడానికే కొందరి ప్రోద్భలంతో ఈ పిటిషన్‌ దాఖలు చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివాటిని మౌనంగా చూస్తూ ఉండలేమని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసిన ముగ్గురికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.