Begin typing your search above and press return to search.

ధూళిపాళ్లకు షాకిచ్చిన హైకోర్టు

By:  Tupaki Desk   |   29 April 2021 8:00 AM GMT
ధూళిపాళ్లకు షాకిచ్చిన హైకోర్టు
X
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల సంగం డెయిరీలో అక్రమాలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సంగం డెయిరీలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. అయితే కోర్టు ధూళిపాళ్ల నరేంద్రకు రిమాండ్ విధించింది.

అయితే తనకు రిమాండ్ విధించడాన్ని హైకోర్టులో ధూళిపాళ్ల సవాల్ చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటీషన్ దాఖలు చేయగా.. ఈ కేసులో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ధూళిపాళ్ల నరేంద్ర కేసులో విచారణ కొనసాగించాలని ఏసీబీ అధికారులను ఆదేశించిన కోర్టు మే 5వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ధూళిపాళ్లకు కోర్టు చుక్కెదురు అయినట్టైంది.

సంగం డెయిరీ చైర్మన్ గా ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. ఆ డెయిరీలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని.. అవకతవకలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. సంగం డెయిరీలో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లను సైతం ఏసీబీ స్వాధీనం చేసుకుంది. అవకతవకలు జరిగాయని గుర్తించి ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. రాజమండ్రిసెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే కేసులో మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.