Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇచ్చిన హైకోర్టు !

By:  Tupaki Desk   |   23 April 2020 11:50 AM GMT
ఏపీ ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇచ్చిన హైకోర్టు !
X
కరోనా లాక్ ‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వలస కార్మికులకు వసతి - భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నా అసలు ప్రతి రాష్ట్రంలో ఎంత మంది వలస కార్మికులు వున్నారో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లెక్క తెలియదు. ఈ నేపధ్యంలో కొన్ని చోట్ల వలస కూలీల ఆకలి చావులు సంభవిస్తున్నాయి. దీనితో వలస కూలీలు కష్టాలు పడుతున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ వేశారు. దీన్ని అత్యవసర కేసుగా భావించిన న్యాయస్థానం విచారణ జరిపింది.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో కోట్లాది మంది వలస కార్మికులు రోడ్డున పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని కనీసం మనుషుల మాదిరిగా చూడడం లేదని రామకృష్ణ ఆరోపించారు. లాక్ డౌన్ విధించే సమయంలో కనీసం వలస కార్మికులకు సౌకర్యాలు ఉన్నాయా - లేవా - వారు బతుకుతారా.. లేదా? అనే విషయాలను కూడా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. వలస కార్మికులకి తినడానికి తిండి లేదని - ఉండడానికి షెల్టర్ లేదని.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వందల కిలోమీటర్ల మేర వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

దీన్ని అత్యవసర కేసుగా పరిగణించి విచారణ చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వలస కూలీలకు 24 గంటల్లో మౌలిక వసతులు కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఇప్పటికే లాక్‌ డౌన్ ‌తో స్వస్థలాలకు వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతూ గుంటూరులో ఇద్దరు - గుజరాత్‌ లో ఒకరు చనిపోయిన విషయం పొందుపరచడంతో ఎక్కడా ఆకలి చావులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.