Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డకు షాక్.. మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టు అనుమతి

By:  Tupaki Desk   |   7 Feb 2021 6:24 AM GMT
నిమ్మగడ్డకు షాక్.. మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టు అనుమతి
X
రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి రాష్ట్ర హైకోర్టు అనుమతిని ఇచ్చినట్టు సమాచారం. మంత్రి పెద్దిరెడ్డిని ఫిబ్రవరి 21వ తేదీ వరకు నిర్బంధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది.

మంత్రి పెద్దిరెడ్డి తరుఫున న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ శాఖ మంత్రిగా రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత మంత్రి పెద్దిరెడ్డిపై ఉందని న్యాయస్థానానికి వివరించారు.ఈ క్రమంలోనే మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు బయట తిరగడానికి అనుమతినిచ్చినట్టు తెలిసింది.

ఎస్ఈసీతో ఢీ అంటే ఢీ అంటూ ఆయనకు సహకరించకుండా అధికారులకు పురమాయించిన పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ 16 రోజుల పాటు మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని ఆదేశించారు. రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఆదేశిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనకు ఉన్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే ఈ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసినట్టు తెలిసింది. దీంతో పెద్దిరెడ్డి ఇప్పుడు రాష్ట్రపతి సహా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకునే వీలు చిక్కింది.