Begin typing your search above and press return to search.

ఆ నిర్మాత విషయంలో జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ!

By:  Tupaki Desk   |   22 Nov 2022 8:22 AM GMT
ఆ నిర్మాత విషయంలో జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ!
X
అగ్ర నిర్మాత అశ్వినీదత్‌కు కౌలు పరిహారం ఇవ్వాల్సిందేనని ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది. సాంకేతిక కారణాలతో జాప్యం చేయడం కుదరదని జగన్‌ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కుండబద్దలు కొట్టింది.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం విమానాశ్రయం విస్తరణకు రైతుల నుంచి భూమిని సేకరించారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దడానికి 700 ఎకరాల భూములు అవసరమంటూ టీడీపీ ప్రభుత్వం ఆ భూములను సేకరించి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కి అప్పగించింది.

అయితే మొదట్లో భూములు ఇవ్వడానికి విమానాశ్రయం చుట్టుపక్కల రైతులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని రైతులకు ఇచ్చినట్టే పరిహారంతోపాటు ఏటా కౌలు కూడా చెల్లిస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో రైతులు భూములిచ్చారు.

ఈ క్రమంలో అగ్ర నిర్మాత, వైజయంతీ మూవీస్‌ అధినేత చలసాని అశ్వినీదత్‌ కూడా తనకున్న 39 ఎకరాలను గన్నవరం విమానాశ్రయానికి ఇచ్చారు. అయితే జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విమానశ్రయానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించడం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అశ్వినీదత్‌ తమకు కౌలు చెల్లించాలని హైకోర్టును ఆశ్రయించారు.

నవంబర్‌ 21 జరిగిన విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు కౌలు ఎందుకు చెల్లించడం లేదని నిలదీసింది. సాంకేతిక కారణాలు చెప్పి ఆలస్యం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వాల ఇలాంటి వైఖరితోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడింది. విమానాశ్రయం విస్తరణ కోసం భూములు ఇచ్చిన వారికి ఎప్పటిలోగా కౌలు చెల్లిస్తారో చెప్పాలని రెవెన్యూ శాఖను హైకోర్టు ప్రశ్నించింది.

రెవిన్యూ శాఖ సమాధానం సంతృప్తిగా లేకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఈ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ధర్మాసనం భూ యజమానికి కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో నవంబర్‌ 22న మంగళవారం కూడా హైకోర్టు ఈ కేసును విచారించనుంది. రెవెన్యూ శాఖ చెప్పే సమాధానంగా ఆధారంగా కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలు ఇచ్చే వీలుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.