Begin typing your search above and press return to search.

ఆ వ్యవహారంలో వైసీపీ మహిళా మంత్రికి హైకోర్టు నోటీసులు!

By:  Tupaki Desk   |   27 Dec 2022 1:41 PM GMT
ఆ వ్యవహారంలో వైసీపీ మహిళా మంత్రికి హైకోర్టు నోటీసులు!
X
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రానైట్‌ తవ్వకాలకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ అంశంలో మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. ఇదే వ్యవహారంలో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి మామ ప్రతాప్‌రెడ్డికి కూడా ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

పల్నాడు జిల్లా మొరకపూడిలో 91 ఎకరాల అసైన్డ్‌ భూమిలో తవ్వకాలకు అనుమతించడంలో మంత్రి రజిని హస్తం ఉందంటూ గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ మంత్రి విడదల రజినితో పాటు స్థానిక తహసీల్దార్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.

రజినికి నోటీసుల వ్యవహారాన్ని పరిశీలిస్తే.. చిలకలూరిపేట మండలం మురికిపూడిలో అసైన్డ్‌ భూములను గ్రానైట్‌ తవ్వకాలకు ఇవ్వడంపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. రెవెన్యూ అధికారులు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇవ్వడంపై అసైన్డ్‌ రైతులు అభ్యంతరం తెలిపారు. అసైన్డ్‌ రైతులను బెదిరించి చట్టవిరుద్ధంగా ఎన్‌వోసీ ఇచ్చారని రైతులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో మంత్రి విడదల రజిని, ఎంపీ అవినాష్‌ రెడ్డి మామ ప్రతాపరెడ్డి, తహశీల్దారు, సీఐ, ఎస్సైలకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. పిటిషన్లపై కోర్టు తుది నిర్ణయానికి లోబడి లీజు ఖరారు ఉంటుందని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ మూడు వారాల్లోగా ఏపీ హైకోర్టుకు విడదల రజిని వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అసైన్డ్‌ భూములను సాగు చేసుకుంటోన్న రైతుల నుంచి చట్టవిరుద్ధంగా మైనింగ్‌కు ఎన్‌ఓసీ ఇచ్చారనే ఆరోపణలకు కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.

కాగా విడదల రజిని చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్‌ జగన్‌ రెండో మంత్రివర్గ విస్తరణలో భాగంగా విడదల రజినికి Mీ లకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి లభించింది. అంతేకాకుండా కీలకమైన విశాఖపట్నం జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా కూడా విడదల రజినిని నియమించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.