Begin typing your search above and press return to search.

రాజకీయ దాడులపై ఏపీ హోం మంత్రి ఘాటు స్పందన!

By:  Tupaki Desk   |   27 Jun 2019 10:27 AM GMT
రాజకీయ దాడులపై ఏపీ హోం మంత్రి ఘాటు స్పందన!
X
ఒకవైపు ఏపీలో అధికార మార్పిడి జరిగిన తర్వాత తమ పార్టీ వాళ్లపై దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతూ ఉంది. తమ పార్టీ అధికారం కోల్పోయి - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం అంటోంది. ఫలితాలు వచ్చి నెల రోజులు పూర్తి అయిన తర్వాత కూడా టీడీపీ నుంచి ఈ కంప్లైంట్లు ఆగడం లేదు.

ఈ విషయం మీద ఇప్పటికే హోంమంత్రి మేకతోటి సుచరిత ఒకసారి స్పందించారు. రాజకీయ ప్రతీకార చర్యలకు తావులేదని - రాజకీయ దాడులను నిరోధించాలని డీజీపీని ప్రత్యేకంగా ఆదేశించినట్టుగా ఆమె అప్పుడు ప్రకటించారు. తాజాగా ఈ అంశంపై ఆమె మరోసారి స్పందించారు. ఈ దాడుల విషయంలో టీడీపీ ఆరోపణలు ఆగకపోవడంతో ఆమె ఘాటుగా స్పందించారు.

'ప్రతి చోటా కాపాలాగా ఉండలేం..' అంటూ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఆమె అన్నారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. రాజకీయ దాడులకు గురైనవారు ఫిర్యాదు చేస్తే తప్పకుండా నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

దాడులు జరగాలని తాము కోరుకోవట్లేదని, రాజకీయ దాడులపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కూడా చెప్పారన్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఎంతగానో గగ్గోలు పెడుతూ ఉంది. ఆ పార్టీ అనవసరమైన రాజకీయం చేస్తోందన్నట్టుగా.. ఈ అంశంలో స్పందించారు ఏపీ హోం మంత్రి.