Begin typing your search above and press return to search.

ఏపీ హోం మంత్రి భర్త బదిలీ వ్యవహారం ఇప్పుడంత హాట్ టాపిక్ ఎందుకు?

By:  Tupaki Desk   |   7 Nov 2021 4:30 PM GMT
ఏపీ హోం మంత్రి భర్త బదిలీ వ్యవహారం ఇప్పుడంత హాట్ టాపిక్ ఎందుకు?
X
ఏపీ అధికారపక్షంలో ఇప్పుడు ఒక అంశం హాట్ టాపిక్ గా మారింది. అధికారం చేతిలో ఉన్న వేళలో.. తాము ఏమైనా చేయగలమనే భావనకు చెక్ పెట్టే ఘటన చోటు చేసుకోవటం.. దీనికి కర్త.. కర్మ.. క్రియ.. మొత్తం సొంత పార్టీకి చెందిన వారే కావటం ఇప్పుడు షాకింగ్ గా మారిందని చెబుతున్నారు. ఇంతకూ ఏపీ హోం మంత్రి మేకపాటి సుచరిత భర్తకు సంబంధించిన బదిలీ వ్యవహారం అధికార పార్టీలోని అధిపత్య పోరుకు ఒక నిదర్శనంగా చెబుతున్నారు. ఇంతకూ అసలేం జరిగింది? ఏపీ హోం మంత్రి భర్తకే షాకిచ్చిన వైనం ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే..

ఏపీ హోంమంత్రిగా వ్యవహరిస్తున్న మేకతోటి సుచరిత భర్త మేకతోటి దయాసాగర్ ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారి. సివిల్స్ సాధించిన ఆయన ఐఆర్ఎస్ విభాగంలో విధులు నిర్వహిస్తుంటారు. తన పని ఏదో తాను చేసుకుంటూ పోయే ఆయన గురించి ప్రస్తావన పెద్దగా బయటకు రాదు. ఇదిలా ఉంటే ఆయన దీపావళికి కాస్త ముందుగా విజయవాడకు ఆదాయ పన్ను కమిషనర్ గా బదిలీ మీదకు వచ్చారు. కీలకమైన పోస్టింగ్ లోకి దయాసాగర్ వచ్చినంతనే.. పలువురు వైసీపికి చెందిన నేతలు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాలు కప్పి సన్మానాలు కాకున్నా.. ఆ రేంజ్లో శుభాకాంక్షలు తెలిపారు.

ఇలా హడావుడి నడుస్తున్న వేళ.. ఊహించని ట్విస్టు ఒకటి చోటు చేసుకుంది. కేవలం బదిలీ మీద వచ్చిన రోజుల వ్యవధిలోనే ఆయనకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు బదిలీ చేయటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. రాష్ట్రానికి హోం మంత్రిగా వ్యవహరిస్తున్న మహిళ భర్తను అక్కడెక్కడో ఉన్న జబల్ పూర్ కు బదిలీ చేయటం ఏమిటన్నది అర్థం కాని పరిస్థితి. అది కూడా రోజుల వ్యవధిలోనే ఆయన్ను పంపేయటం వెనుక ఏపీ అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు కొందరు ఉన్నట్లు చెబుతున్నారు.

హోంమంత్రి భర్త కానీ ఐటీ శాఖలో కీలకమైన స్థానంలో ఉంటే.. ఆయనకు ప్రాధాన్యత పెరగటంతోపాటు.. తమ బలం తగ్గుతుందన్న అనుమానాలే తాజా బదిలీకి కారణంగా చెబుతున్నారు. ఆయన్ను వెంటనే బదిలీ చేయాలని ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు తీసుకురావటంతో వెంటనే పంపేయక తప్పలేదంటున్నారు. నిజానికి.. అధికార పార్టీకి చెందిన కీలక మంత్రి భర్త.. ఒక ఉన్నత స్థాయి అధికారి అయినప్పుటు అభ్యంతరం వ్యక్తం చేయాల్సింది విపక్షం. అందుకుభిన్నంగా సొంత పార్టీ నేతలు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పటంతో రోజుల వ్యవధిలోనే వేరే రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న మాట వినిపిస్తోంది.