Begin typing your search above and press return to search.

మోడీకి ఏపీ భ‌య‌ప‌డుతోంది.. అందుకే నోరు క‌ట్టేసుకుంది: తెలంగాణ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   15 Nov 2022 5:41 AM GMT
మోడీకి ఏపీ భ‌య‌ప‌డుతోంది.. అందుకే నోరు క‌ట్టేసుకుంది:  తెలంగాణ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ షాకిస్తుంటే.. ఏపీ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంద‌ని వ్యాఖ్యానించారు. అందుకే, విశాఖ‌లో ప‌ర్య‌టించినా అక్క‌డి ఉక్కు ఫ్యాక్ట‌రీ అంశాన్ని క‌నీసం ప్ర‌స్తావించ‌లేద‌ని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణను మొదట్నుంచి వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో కేంద్రాన్ని ఎదుర్కొ న్నారని, అందుకే ప్రధాని మోడీ తలొగ్గారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

ఈ కారణంగానే రామగుండంలో మోడీ మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణ లేదని ప్రకటించారని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను కేసీఆర్ అడ్డుకుంటున్నారని, అందుకే రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకుండా రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. పక్క రాష్ట్రం ఏపీలో మాత్రం అటువంటి పరిస్థితి లేదని, అక్కడి ప్రభుత్వం కేంద్రానికి భయపడుతోందని, అందుకే అక్కడ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా మోడీ విశాఖకు వెళ్లినప్పుడు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై అక్కడి ప్రభుత్వం ఆయన్ను ప్రశ్నించలేకపోయిందని, అందుకే విశాఖ ఉక్కుపై ఒక్క మాటకూడా మాట్లాడలేదన్నారు. కార్మికుల ఒత్తిడితోపాటు తెలంగాణ‌లో బలమైన నాయకుడు ఉండటం వల్లే సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని ప్రధాని స్వయంగా ప్రకటించారని తెలిపారు. ఇది కార్మికులు, టీఆర్ఎస్ సర్కారు విజయమని ఆయన పేర్కొన్నారు.

ఏపీలో దిక్కూ దివాణం లేదు కాబట్టే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వైఖరి మారడం లేదని, అందుకే మోడీ స్పందించలేదని కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. అయితే సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంటులో ఇచ్చిన సమాధానానికి, రామగుండంలో మోడీ మాటలకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు.

ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్దాలు మాట్లాడటం దురదృష్టకర మన్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు యత్నించి కేంద్రం భంగపడిన విషయం నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు, వారికి సంబంధించిన పలు సమస్యలపై మోడీ మాట్లాడితే బాగుండేదన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.