Begin typing your search above and press return to search.

బిహార్ లో కాదు ఏపీలో: వైద్యం చేశాక డబ్బులడిగితే మర్డర్లు నా వృత్తి అన్నాడు

By:  Tupaki Desk   |   8 April 2022 4:28 AM GMT
బిహార్ లో కాదు ఏపీలో: వైద్యం చేశాక డబ్బులడిగితే మర్డర్లు నా వృత్తి అన్నాడు
X
అధికారం చేతిలో ఉండొచ్చు. అంతమాత్రాన బరితెగింపుతో వ్యవహరించటం అస్సలు బాగోదు. బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఏపీ అధికారపక్ష నేతలు.. వారి అనుచరుల వైఖరికి నిలువెత్తు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. వైద్యం చేసి.. డబ్బులు అడిగిన మహిళా వైద్యురాలిని ఉద్దేశించి చేసిన దారుణ మాటలు వింటే.. ఇదంతా జరిగింది బిహార్ లోనా? అన్న భావన కలుగక మానదు. బ్యాడ్ లక్ ఏమంటే.. ఇలాంటివన్నీ ఈ మధ్యన ఏపీలో జరుగుతున్నాయి.

నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఆసుపత్రుల్లో సుజాత ఆసుపత్రి ఒకటి. ముచ్చుమర్రికి చెందిన బాషా ఐదు నెలల గర్భవతి అయిన తన కుమార్తెను తీసుకొచ్చాడు. రక్తస్రావం.. నొప్పులతో బాధ పడుతున్న ఆమెను సిబ్బంది ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యం చేశారు. చికిత్స అనంతరం బిల్లు చెల్లించాలని కోరారు. దీంతో చెలరేగిపోయిన బాషా.. ఎవరిని డబ్బులు అడుగుతున్నారో తెలుసా? అంటూ వెంటబెట్టుకొచ్చిన అనుచరులతో ఆసుపత్రి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో నానా హంగామా చేశారు.

అక్కడితో ఆగని భాష.. మర్డర్లు చేయటం తన వృత్తి అని.. తననే డబ్బులు అడుగుతారా? అంటూ మండిపడుతూ.. డబ్బులు అడిగితే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. తాను బైరెడ్డి సిద్ధార్థ్ మనిషినని.. తాను తలుచుకుంటే సాయంత్రానికి ఆసుపత్రి లేకుండా చేస్తానని హెచ్చరిస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. దీంతో.. ఆసుపత్రిని నిర్వహిస్తున్న వైద్య దంపతులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. పోలీసుల కంప్లైంట్ నేపథ్యంలో యాదవ సంఘం నాయకులు.. సిద్ధార్థ్ రెడ్డి అనుచరులు ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి నిర్వాహకులైన వైద్య దంపతులతో మంతనాలు జరిపారు. చివరకు ఇష్యూను సెటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

వైద్యురాలిని బెదిరించిన ఉదంతంపై కేసు నమోదు చేశారా? అని పోలీసుల్ని అడిగితే వారి నుంచి వచ్చిన సమాధానం మరింత సిత్రంగా ఉంది. వైద్యురాలు..ఆసుపత్రి సిబ్బంది పోలీస్ స్టేషన్ కు వచ్చారని.. కంప్లైంట్ ఇచ్చారు కానీ ఆ పత్రం మీద సంతకం లేదని ఎస్ ఐ చెప్పకటం గమనార్హం.

సంతకం విషయాన్ని చెబుతూ ఆ పత్రాన్ని ఆసుపత్రికి పంపితే.. సంతకం చేయలేదన్నారు. ఒక డాక్టరమ్మ పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు.. కింద సంతకం లేని విషయాన్ని పోలీసులు ఎందుకు గుర్తించరు? అయినా.. అంత పెద్ద డాక్టరమ్మ ఫిర్యాదు చేసి.. చివర్లో సంతకం చేయకుండా ఉంటారా? లాంటి సందేహాలు రావొచ్చు. కానీ.. వాటికి సమాధానాలు రావన్నమాట వినిపిస్తోంది. ఏపీలోని పరిస్థితి ఇలా ఉండటం రాష్ట్ర శ్రేయస్సుకు ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.