Begin typing your search above and press return to search.

నేతల 'ప్రత్యేక' సంపాదన

By:  Tupaki Desk   |   26 Sep 2016 6:35 AM GMT
నేతల ప్రత్యేక సంపాదన
X
ఏపీకి ప్రత్యేక హోదాపై ఏమాత్రం చిత్తశుద్ధి చూపకుండా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో సరిపెట్టుకున్న పాలక పార్టీ టీడీపీ నేతలు చెబుతున్న మాటలు వింటే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది. కేంద్ర మంత్రిగా ఉన్న టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అయితే హోదా వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదనే అంటున్నారు. కానీ... టీడీపీ నేతలంతా ప్రత్యేక హోదా వల్ల భారీ ప్రయోజనాలు పొందినవారు. అవును... ప్రత్యేక హోదా ఉన్న పలు రాష్ర్టాల్లో పెట్టుబడులు పెట్టి పన్ను ప్రోత్సాహాలు అందుకుంటూ లాభపడుతున్నారు. ముఖ్యంగా అంతా ఉత్తరాఖండ్ కేంద్రంగా తమ వ్యాపారాలు చేస్తూ ''ప్రత్యేకం"గా సంపాదించుకుంటున్నారు.

ఉత్తరాఖండ్‌ ఏర్పడ్డాక కేంద్రంలోని అప్పటి వాజపేయి సర్కారు ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించింది. హోదా వల్ల లభించే లాభాలను అందుకునేందుకు ఏపీ నుంచి పలువురు నేతలు ఆ రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టారు. అందులో కేంద్ర మంత్రి సుజనా చౌదరి టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే... ప్రత్యేక హోదాతో లాభమేమీ ఉండదని వాదిస్తున్న సుజనా ఉత్తరాఖండ్ లో సొంతంగా పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఫ్యాన్లకు సంబంధించిన మేన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను సుజనా నెలకొల్పారు. ఆ సంస్థకు ఛైర్మన్‌ హోదాలో 2006లో వార్షిక నివేదిక విడుదల చేసిన ఆయన... అందులో.. ఉత్తరాఖండ్‌లో తయారీ పరిశ్రమ అభివృద్ధికి మంచి సౌకర్యాలు, ప్రోత్సాహకాలున్నాయని పేర్కొన్నారు. ఎక్సయిజ్‌ డ్యూటీ మినహాయింపు, సెంట్రల్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (సిఎస్‌టి) తగ్గింపు, ఆదాయపన్ను రాయితీలు ఉన్నాయని, పరిశ్రమల విస్తరణ, ఉత్పత్తికి అవకాశం కలుగుతుందని ప్రస్తావించారు. అదంతా ప్రత్యేక హోదా ఫలితమేనని చెప్పనవసరం లేదు. కానీ... అదే సుజనా ఇప్పుడు ఏపికి ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెబుతుండడంతో సుమారు దశాబ్దం క్రితం తన కంపెనీ వెబ్‌సైట్‌లో సుజనా పేర్కొన్న ఈ ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాల అంశాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.

- రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌ ఉత్తరాఖండ్ లో నార్త్‌ ఈస్ట్రన్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ (పి)లో రూ.69 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు.

- టిడిపికి చెందిన గుంటూరు ఎంపి గల్ల జయదేవ్‌కు చెందిన తమ అమర రాజా కంపెనీ బ్యాటరీల ప్లాంట్‌ను ఉత్తరాంచల్‌లో నెలకొల్పేందుకు భూములు కొనుగోలు చేసింది. సంస్థ 2009-10 వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడించింది.

- గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌ సమీపంలోని రుద్రపూర్‌లో శివశక్తి బయోప్లాంటెక్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు.

- టిడిపి ఎంపీలు జెసి దివాకర్‌రెడ్డి, రాయపాటి సాంబశివరావు, కాంగ్రెస్‌ నుంచి బిజెపిలోకి చేరిన కావూరు సాంబశివరావు తదితరుల సంస్థలు ఉత్తరాఖండ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.

- వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి సైతం ఉత్తరాఖండ్‌లో పెట్టుబడులున్నట్లు టిడిపి నేతలు చెబుతున్నారు.