Begin typing your search above and press return to search.

రాజకీయ దైన్యమేనా.. ?

By:  Tupaki Desk   |   25 Oct 2021 9:30 AM GMT
రాజకీయ దైన్యమేనా.. ?
X
ఆంధ్రప్రదేశ్ అంటే ఘనమైన చరిత్ర కలిగినది. పురాణాలలో సైతం ఆంధ్రుల ప్రస్థావన ఉందని అంటారు. అంటే వేల ఏళ్ల నుంచి ఆంధ్రుల ప్రసక్తి ఎక్కడో ఒక చోట వస్తూనే ఉందన్న మాట. అలాంటి ఆంధ్రులు ఇపుడు అన్ని విధాలుగా అవమానం పాలు అవుతున్నారు. ఎటు చూసినా చులకన అవుతున్నారు. దీనికంతటికీ కారణం సరైన రాజకీయం ఏపీలో లేకపోవడమే అంటున్నారు. నాయకత్వం మాదే అని జబ్బలు చరచే వారు, సీనియర్ మోస్ట్ లీడర్లు అన్న వారు కూడా సొంతం కొసం చేసే పనులు, మరో వైపు అవతల వర్గం పంతానికి పోయి చేస్తున్న చేష్టలు మొత్తానికి ఆంధ్రుల పరువుని మంట గలుపుతున్నాయనే అంటున్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉండగా ఎక్కడా లేని వివాదాలు ఏపీలోనే సాగుతున్నాయి. జాతీయ స్థాయిలో పతాక శీర్షికలు ఎక్కే ఘటనలు కూడా అక్కడే జరుగుతున్నాయి.

ఏపీలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత లేదు. దాంతో రాష్ట్రం పూర్తిగా నష్టపోతోంది. ఒక వైపు కల లాంటి తెలంగాణాను తెలంగాణావాసులు సాధించుకుంటే విభజన హామీలలో అతి ముఖ్యమైనదిగా ఉన్న ప్రత్యేక హోదాను ఈ రోజుకూ ఏపీ సాధించుకోకపోవడం అంటే అది కచ్చితంగా రాజకీయదైన్యంగానే చూడాలని అంటారు. ఇక విభజనకు ముందు తెలంగాణా ఒక రాష్ట్రంగా విడిపోతే అది అసలు మనలేదు అని అన్నారు, చీకటి తప్ప కరెంట్ ఉండదని కూడా చెప్పారు, ఇపుడు ఏడేళ్ళ తరువాత చూస్తే అవతల రాష్ట్రం వారే ఏపీని ఈ విషయాల్లో నిందిస్తున్నారు. ఏపీ ఒక రాష్ట్రంగా మనుగడ సాగించేనా అన్న సందేహాలు కూడా మేధావుల్లో కలుగుతున్నాయంటే ఆ తప్పిదం ఎవరిది అని ప్రశ్నించుకుని తీరాల్సిందే.

ఇక ఏపీలో సరీన లీడర్ షిప్ ఉందా లేదా అంటే జనాల మనోగతాన్నే అడగాలి మరి. ఏపీలో కక్షకు కావేశాలు పెద్ద పీట వేసుకుని కూర్చున్నాయి. అన్ని రకాలుగా దిగజారి, విభజన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రంలో ఇంకా అశాంతిని పెంచి పెద్దది చేయాలని చూస్తున్నారు. ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వదు, ఒకవేళ ఇవ్వాలనుకున్న అడ్డుపుల్లలు వేసేవారు, చాడీలు చెప్పేవారు మరో వైపు అక్కడే తయారుగా ఉన్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువైపోయిన ఈ రొచ్చును చూసి జనాలు తెగ నొచ్చుకుంటున్నారు. వాస్తవం చెప్పాలంటే ఈ ఏడేళ్లలో ఎన్నో సార్లు తెలంగాణాను ఏపీ వారు తలచుకుని ఉన్నారు. ఏదైనా సాధించుకోవాలి అంటే వారు చూపించే తపన, సంకల్పం దీక్షా దక్షతలను మెచ్చుకోని వారు కూడా ఏపీలో బహుశా ఎవరూ ఉండరేమో.

మొత్తానికి ఈ పరిణామాలన్నీ గమనించే కాబోలు తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీయార్ ఏపీలో జనాలు తనను పోటీ చేయమని అంటున్నారు అని చెప్పేశారు. టీయారెస్ ఆవశ్యకత తెలంగాణా కంటే కూడా ఏపీకే ఎక్కువగా ఉందని కూడా ఆయన అంటున్నారు అంటే ఏపీలో రాజకీయ దైన్యం గురించే అనుకోవాలోమో. కేంద్రం వద్ద పెండింగులో పడిన నిధులను డిమాండ్ చేసి సాధిచుకుని వస్తున్న తెలంగాణా అన్ని విషయాల్లో దూకుడుగా ఉంది. సరే కేసీయార్ ఆంధ్రులకు టీయారెస్ అవసరం ఉంది అంటున్నారు, మరి జనాల మనోగతం కూడా అలాగే ఉందా అంటే ప్రజలు ఎపుడూ కోరుకునేది తమ బాగు కోసమే. వారికి ఎవరు పాలితులు అన్న ప్రశ్న ఉండదు. తమ జీవితాలు సాఫీగా జరగాలనే భావిస్తారు.

మరి కేసీయార్ నిజంగా తాను అన్నట్లుగానే ఏపీలో కూడా టీయారెస్ ని విస్తరిస్తే అపుడు రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైన ప్రస్తుతం ఏపీలో సాగుతున్న రాజకీయాల పట్ల జనాలు విసిగి వేసారారు అంటే సబబుగా ఉంటుందేమో. ఇకనైనా పొరుగున సాగుతున్న పాలనను, రాజకీయాన్ని చూసి ఏపీ నేతలు తమ గమనాన్ని మార్చుకుంటారని కూడా ఆశించవచ్చేమో. లేకపోతే ఇవాళ కేసీయార్ తన పార్టీని ఏపీకి విస్తరిస్తారు, రేపు తమిళనాడు నుంచి స్టాలిన్, ఒడిషా నుంచి నవీన్ పట్నాయక్ కూడా తమ పార్టీలను ఏపీ రాజ‌కేయ బరిలో దింపినా దింపుతారు. అపుడు జనాలకు పోయేది ఏమీ లేదు, రాజకీయ పార్టీలే పెద్ద ఎత్తున నష్టపోతాయి. అందుకే తస్మాత్ జాగ్రత్త.