Begin typing your search above and press return to search.

సైకో పార్టీ అని పేరు పెట్టుకోవాలంట

By:  Tupaki Desk   |   3 Sep 2015 6:03 AM GMT
సైకో పార్టీ అని పేరు పెట్టుకోవాలంట
X
ఏపీ అసెంబ్లీలో మాటలు తూటాల్లా పేలుతున్నాయి. అధికార.. విపక్ష సభ్యుల వ్యాఖ్యలు అంతకంతకూ హీట్ పెంచేస్తున్నాయి. ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తూ.. తమ వాదనను వినిపించటానికి అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ పోడియం వద్దకు చేరి గురువారం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన చేయటం ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్పీకరు స్పందిస్తూ.. విపక్ష సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లిపోవాలని.. పోడియం చుట్టుముట్టటం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సభా సమయాన్ని వృధా చేస్తున్నారని విమర్శిస్తూ.. వైసీపీ కాదని.. సైకో పార్టీ అని పేరు పెట్టుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మరింత బిగ్గరగా నినాదాలు చేస్తూ.. మంత్రి వ్యాఖ్యలపై డి పడ్డారు.

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు.. తదనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఆందోళనలతో అట్టుడికిపోవటంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. దీంతో.. సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. విపక్షాలు ఆందోళన చేయటం మామూలే. అంతమాత్రాన.. విపక్ష పార్టీని సైకో పార్టీగా పేరు పెట్టుకోవాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడుకు సరికాదన్న వాదన వినిపిస్తోంది. తమ వాదనతో విపక్షాల ఎత్తుల్ని చిత్తు చేయాలే తప్పించి.. దూకుడుగా మాట్లాడినంత మాత్రనా ప్రజల మనసుల్ని గెలుచుకుంటారని భావించటం పొరపాటే అవుతుంది. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తించి..తన పార్టీ నేతల నోటిని అదుపులోకి పెట్టుకోవాలని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.