Begin typing your search above and press return to search.

సర్ ప్రైజ్ : ఏపీ మంత్రికి రైతు భ‌రోసా...!!

By:  Tupaki Desk   |   11 Oct 2019 11:09 AM GMT
సర్ ప్రైజ్ : ఏపీ మంత్రికి రైతు భ‌రోసా...!!
X
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నామని చెబుతున్న రైతు భరోసా లబ్ధిదారుల పథకంలో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేరు ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ప్ర‌భుత్వం రైతుల కోసం రైతు భ‌రోసా ప‌థ‌కం అమ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఐటీ జాబితాలో పేర్లు ఉన్న వారితో పాటు మంత్రుల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌ద‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. అయినా జ‌గ‌న్ కేబినెట్‌లో విద్యాశాఖా మంత్రిగా ఉన్న‌సురేష్ పేరు ఈ జాబితాలో చేరిపోయింది.

సాక్షాత్తు మంత్రి పేరు జాబితాలో దర్శనమివ్వడంతో విపక్షాలు ఆశ్చర్యపోతున్నాయి. ప్రకాశం జిల్లా య‌ర్రగొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గంలోని త్రిపురాంతకం మండలం గణపవరంలో మంత్రి సురేష్‌ పేరున 94 సెంట్ల భూమి ఉంది. అలాగే కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కూడా ఆయ‌న‌కు మొత్తం 19 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి ఉన్న‌ట్టు తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం.

ఏదేమైనా ప్ర‌భుత్వం అందించే ప‌థ‌కాలు పేద‌ల‌కు... అర్హుల‌కు ఖ‌చ్చితంగా అందాల్సి ఉంటుంది. ఈ లిస్టుల్లోకి ఎమ్మెల్యేల పేర్లు, మంత్రుల పేర్లు వ‌స్తుండ‌డంతో అది ప్ర‌తిప‌క్షాల‌కు అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌ల‌కు తావిచ్చిన‌ట్ల‌య్యింది. ఇక కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు పేరిట తెల్ల రేషన్ కార్డు ఉన్న సంగతి కూడా బయటకు వచ్చింది.

గ్రామ వ‌లంటీర్‌ స్వయంగా అప్పల రాజు ఇంటికి వెళ్లి మరి రేషన్ అందించడంతో ఎమ్మెల్యే స్వ‌యంగా వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అప్ప‌ట్లో కూడా దీనిని టార్గెట్‌గా చేసుకుని విప‌క్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశాయి. వజ్రపుకొత్తూరు మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామం దేవున‌ల్తాడలో ఎమ్మెల్యే అప్పలరాజు పేరిట న‌లుగురు కుటుంబ సభ్యులతో కార్డు ఉన్నట్టు గుర్తించిన అధికారులు వెంటనే కార్డును జాబితా నుంచి తొలగించారు.