Begin typing your search above and press return to search.

ఇదేం ధర్మం ధర్మాన.. ఖాతాల్లో డబ్బులు వేస్తే అవసరాలు తీర్చరా?

By:  Tupaki Desk   |   30 May 2022 7:30 AM GMT
ఇదేం ధర్మం ధర్మాన.. ఖాతాల్లో డబ్బులు వేస్తే అవసరాలు తీర్చరా?
X
కొన్ని సందర్భాల్లో చేసేది అస్సలు చెప్పకూడదు. కానీ.. ఆ చిన్న విషయాన్ని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మిస్ అయ్యారు. వైసీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకుండానే ఆ పార్టీ భారీ కార్యక్రమాన్ని చేపట్టటం తెలిసిందే. సామాజిక న్యాయ భేరి పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర అనంతపురానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి ధర్మాన తన మాటలతో షాకిచ్చారు.

జగన్ పాలనను తన మాటలతో తేల్చేసిన ఆయన.. విమర్శలకు కొత్త అస్త్రాల్ని అందించారన్న మాట వినిపిస్తోంది. అనంతపురం జూనియర్ కాలేజీలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి ధర్మాన.. 'రాష్ట్రంలో బడుగుల అభ్యున్నతికి గొప్ప పనులు జరిగాయి. అయినా అక్కడక్కడా కొన్ని పనులు జరగలేదని వ్యాఖ్యానించొద్దు.

ఎందుకు జరుగుతాయి. మన అవసరాల కోసం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తూ ఉంటే అన్ని అవసరాలు తీర్చటానికి మరికొంత సమయం పడుతుంది. గడిచిన 75 ఏళ్లలో వీటిని తీర్చి ఉంటే అవి ఇప్పుడు ఉండేవి కాదు కదా?'' అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. తమ ప్రభుత్వం బడుగు.. బలహీన వర్గాలకు ప్రాధాన్యమిస్తోందని.. అందుకే పనులు ఆలస్యమవుతాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బడుగులు గౌరవంగా బతికే స్థాయికి ఎదిగిన తర్వాత పనులను వచ్చే కాలంలో చేద్దామని.. తొందరేమీ లేదని వ్యాఖ్యానించటం విశేషం. సమాజంలో బడుగులు.. బలహీనుల అభ్యున్నతి మాత్రమే ముఖ్యమన్నట్లుగా మంత్రి మాటలు ఉండటం గమనార్హం.

సాధారణంగా సమాజంలో మౌలిక వసతులు.. డెవలప్ మెంట్ జరిగి.. బడుగులకు.. బలహీనులకు ఉపాధి అవకాశాలు.. వారు చేసే పనులకు అధిక ఆదాయం లభించేలా ప్రభుత్వాలు పని చేయటం ద్వారా.. వారికి వారు డెవలప్ అవుతారు. అంతే తప్పించి.. అదే పనిగా తాయిలాలు అందిస్తూ కూర్చుంటే.. ప్రగతి రథం ముందుకు సాగకపోగా.. అనవసరమైన పరిస్థితులు ఏర్పడతాయి. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయటమే తమ ప్రాధాన్యమన్నట్లుగా మంత్రి ధర్మాన మాటలు ఉండటం గమనార్హం.

వివిధ పథకాల పేరుతో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్న ప్రభుత్వం.. వాటిని లబ్థిదారులు వేటి కోసం ఖర్చు చేస్తున్నారు? అన్న అంశం మీద ఫోకస్ చేశారా? మూడేళ్ల వ్యవధిలో లక్షల కోట్లు పథకాల పేరుతో ఖర్చు చేశారు కదా? ఏపీలో పేదరికం ఏమేరకు తగ్గింది? అన్న లెక్కల్ని కూడా ధర్మాన చెబితే బాగుండేది. అదేమీ లేకుండా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో వేస్తాం.. వారంతా బాగు పడిన తర్వాత పనులు చేస్తామన్న తీరును పలువురు తప్పు పడుతున్నారు.