Begin typing your search above and press return to search.

ధర్మాన పుణ్యమే : ప్రత్యేక రాయలసీమ కావాలంట...!

By:  Tupaki Desk   |   31 Dec 2022 2:11 PM GMT
ధర్మాన పుణ్యమే : ప్రత్యేక రాయలసీమ కావాలంట...!
X
ఊరుకోకుండా ధర్మాన ప్రసాదరావు  వంటి సీనియర్ మంత్రి ఎక్కడో గిల్లారు. ఇపుడు అది మంట అయిపోయేలా ఉంది. అసలే విభజన గాయాలతో కునారిల్లుతున్న ఏపీకి మళ్ళీ ముక్కలు చెక్కలు కావడం కావాలా. అందునా బాధ్యత కలిగిన సీనియర్ మంత్రి ధర్మాన ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తారని ఎవరూ అనుకోలేదు.

కానీ పెద్దాయన సడెన్ గా ఉత్తరాంధ్రా రాష్ట్రం అని నోరు జారేశారు ఇపుడు దాన్ని పట్టుకుని రాయలసీమ నాయకులు గట్టిగానే తగులుకుంటున్నారు. రాజధాని కనుక షిఫ్టింగ్ అయితే ప్రత్యేక రాయలసీమ ఇవ్వాల్సిందే అని వారు పట్టుపడుతున్నారు. బీజేపీలో ఉన్న సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయితే ధర్మాన మాటలను గట్టిగా కౌంటర్ చేశారు.

రాష్ట్రం అడగాల్సింది మేము, మీరు కాదు అంటూ మంత్రి గారికి గట్టిగా ఇచ్చి పడేశారు. నీళ్ళూ నిధులు నియామకాలు వంటి వాటి విషయంలో పూర్తిగా అన్యాయం జరిగింది రాయలసీమకే అని ఆయన వాదిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాయలసీమ వాసులు త్యాగం చేయడమే కాదు ప్రాణాలు వదులుకున్నారని ఆయన గుర్తు చేశారు.

ఇవన్నీ మరచిపోయి మంత్రి గారు మాట్లాడడం తగదని ఆయన హితవు పలికారు. అమరావతి నుంచి రాజధాని కదిలితే కచ్చితంగా అది కర్నూల్ కే తరలిరావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రి ధర్మాన కూడా తమకే మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

అలాగే ఆయన మరో మాట అన్నారు. ఉత్తరాంధ్రా మీద అంత ప్రేమ ఒలికిపోతూంటే మంత్రి గారు తమ పదవికి రాజీనామా చేసి అప్పుడు మాట్లాడాలని సూచించారు. ఉమ్మడి ఏపీ విభజన వల్ల రాయలసీమ పూర్తిగా నష్టపోయిందని, అలనటి సీమకు మరింత అన్యాయం చేయడం ఎవరికీ తగదని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ధర్మాన ఉత్తరాంధ్రా రాష్ట్రం అంటూ మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాలలో మంటను పుట్టిస్తున్నాయి. బైరెడ్డి రాజశేఖర రెడ్డి వంటి వారు కొన్నాళ్ళుగా రాజకీయలకు దూరంగా ఉన్నారు. అలాంటి పెద్ద మనిషి ఇపుడు ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని అందుకున్నారు.

ఇక సీపీఐ రామక్రిష్ణ అయితే ధర్మాన మంత్రి పదవికి అనర్హుడు అంటూ ఘాటైన పదాలే వాడేశారు. అమరావతి రాజధానిని సర్వనాశనం చేయడానికే ధర్మాన ఈ విధంగా మాట్లాడారని కూడా మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఈ విషయం మీద ఇప్పటిదాకా రియాక్ట్ అవలేదు. అదే సమయంలో వైసీపీలో కూడా ధర్మనా కామెంట్స్ మీద ఎవరూ మద్దతుగా మాట్లాడంలేదు.

మొత్తానికి ధర్మాన ఉత్తరాంధ్రా రాష్ట్రం అంటూ చిచ్చు రేపారా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది. మరి ఆయన ఆలోచనలు ఉద్దేశ్యాలు ఏంటో కానీ ఏపీలో కొత్త ఏడాది ముంగిట్లో కొత్త రాజకీయ ఘర్షణకు అవకాశం ఏర్పడింది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.