Begin typing your search above and press return to search.

కాంట్రాక్ట‌ర్ల‌ను భ‌య‌పెడితేనే ప‌నులు: వైఎస్సార్సీపీ మంత్రి హాట్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   22 July 2022 8:26 AM GMT
కాంట్రాక్ట‌ర్ల‌ను భ‌య‌పెడితేనే ప‌నులు: వైఎస్సార్సీపీ మంత్రి హాట్ కామెంట్స్!
X
కాంట్రాక్టర్లను ఏదో రకంగా భయపెట్టకపొతే పనులు జరగవని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవసరం అయితే కొద్ది మంది కాంట్రాక్ట‌ర్ల‌ను బ్లాక్ లిస్ట్‌లో కూడా పెట్టాల‌న్నారు. గతంలో మాదిరిగా కాంట్రాక్ట‌ర్ల‌కు పెద్ద ఎత్తున లాభాలు రావాలంటే కుదరద‌న్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఒక కార్య‌క్ర‌మంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న రాష్ట్రంలోని ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఇంజినీరింగ్ సిబ్బంది బాధ్యతతో వేగవంతంగా అంచ‌నాలు వేసి తొందరగా పనులు జరిపించాలని ఆదేశించారు. అయితే, కాంట్రాక్టర్లను ఏదో రకంగా భయపెట్టకపొతే పనులు జరగవ‌న్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. చేసిన ప‌నుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం బిల్లులు చెల్లించ‌డం లేద‌ని చాలామంది కాంట్రాక్ట‌ర్లు ఇప్ప‌టికే హైకోర్టును ఆశ్ర‌యించార‌ని కాంట్రాక్ట‌ర్లు గుర్తు చేస్తున్నారు.

చివ‌ర‌కు వివిధ ర‌కాల అభివృద్ధి ప‌నులు చేసిన వైఎస్సార్సీపీ చోటా మోటా నేత‌ల‌కే బిల్లులు రాక వైఎస్సార్సీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను నిల‌దీస్తున్నార‌ని చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క కాంట్రాక్ట‌ర్ కు ప్ర‌భుత్వం బిల్లులు చెల్లించ‌డం లేద‌ని.. ఇలాంటి ప‌రిస్థితుల్లో కాంట్రాక్ట‌ర్ల‌ను బెదిరించేలా ధ‌ర్మాన వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదంటున్నారు.

కాగా ధ‌ర్మాన అంత‌కు ముందు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా వ‌లంటీర్ల‌పై నిప్పులు చెరిగిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు వలంటీర్లు పనిచేస్తున్నార‌నే ఫిర్యాదులు గ్రామస్థాయిలో వస్తున్నాయని ఆయ‌న అన్నారు. 50 కుటుంబాలకు ఒక కొడుకుగా సేవ చేసే బాధ్యతను విస్మరించి.. ప్రభుత్వానికే ఎసరు పెట్టాలని చూస్తే తొలగిస్తామని వ‌లంటీర్ల‌ను హెచ్చరించారు.

శ్రీకాకుళం రూరల్‌ మండలం భైరిలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్య‌లు చేశారు. 'అటువంటి వలంటీర్లు స్వచ్ఛందంగా తప్పుకోవాలి. లేకుంటే మేమే తప్పించాల్సి వస్తుంది' అని హెచ్చరించారు. అటువంటి వలంటీర్ల పేర్ల జాబితా తనకు పంపించాల‌ని అధికారులను కోరారు.

ఇలా ఒకే రోజు మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అటు కాంట్రాక్ట‌ర్ల‌ను, ఇటు వ‌లంటీర్ల‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడ‌టంపై వారు విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు చేస్తున్న త‌మ‌ను బెదిరించ‌డం స‌రికాద‌ని అటు వ‌లంటీర్లు, ఇటు కాంట్రాక్ట‌ర్లు మండిప‌డుతున్నారు. ధ‌ర్మాన త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.