Begin typing your search above and press return to search.

అనిల్‌ను ఇంటికి వెళ్లి స‌త్క‌రించిన మంత్రి కాకాణి.. ర‌గ‌డ త‌గ్గిందా?

By:  Tupaki Desk   |   26 April 2022 3:33 PM GMT
అనిల్‌ను ఇంటికి వెళ్లి స‌త్క‌రించిన మంత్రి కాకాణి.. ర‌గ‌డ త‌గ్గిందా?
X
నిన్న మొన్న‌టి వ‌ర‌కు విభేదాల‌తో కుస్తీ ప‌ట్టిన నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్, ప్ర‌స్తుత మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి.. క‌లుసుకున్నారు. చేయిచేయి క‌లుపుకున్నారు. ప‌ర‌స్ప‌రం శాలువాలు క‌ప్పుకొన్నారు. దీంతో వీరి మ‌ధ్య ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన ర‌గడ పోయిన‌ట్టేనా? లేక‌.. అధినేత జ‌గ‌న్ క‌న్నీళ్లు తుడిచేందుకు ఇలా న‌టిస్తున్నారా? అనే చ‌ర్చ నెల్లూరు రాజ‌కీయాల్లో జోరందుకుంది.

మాజీమంత్రి అనిల్‌తో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ భేటీ సాయంత్రం వ‌ర‌కు కొన‌సాగింది. అనిల్‌ను కాకాణి ప‌ట్టు శాలువా క‌ప్పి పుష్ప గుచ్ఛంతో స‌న్మానించ‌గా..అనిల్ కూడా కాకాణికి శాలువా క‌ప్పి.. పుష్ప గుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిపదవి చేపట్టాక ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలుస్తున్నానని కాకాణి తెలిపారు. అనిల్‌ను కలవడం కొంత ఆలస్యమైందన్నారు.

ప్రతి ఒక్కరినీ కలుపుకునిపోతామన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. జగన్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే అనిల్‌ పేర్కొన్నారు. మంత్రిగా తొలిసారి తన ఇంటికి వచ్చిన కాకాణికి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలతో పాటు, పార్టీని పటిష్టం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. రానున్న రోజుల్లో పార్టీ గెలుపుకోసం సాయశక్తుల పనిచేస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు.

గత కొన్నిరోజులుగా వైఎస్సార్‌సీపీలో విభేదాలు వీధిన పడ్డాయని ప్రచారం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు తాజా, మాజీ మంత్రుల కలయికతో కంగుతిన్నారు. తమది మర్యాద పూర్వక భేటీ అని, జిల్లాలో అందరినీ కలుపుకొని పోతూ సీఎం వైఎస్ జగన్ జనబలాన్ని రెట్టింపు చేస్తామని తాజా, మాజీ మంత్రులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.