Begin typing your search above and press return to search.

కోర్టు నుంచి కీలక పత్రాలు చోరీ... ఎవరి పని...?

By:  Tupaki Desk   |   15 April 2022 5:30 PM GMT
కోర్టు నుంచి కీలక పత్రాలు చోరీ... ఎవరి పని...?
X
తప్పొప్పులకు శిక్షలు వేసే కోర్టు అది. ఆ కోర్టు నుంచే కొన్ని కీలకపత్రాలు చోరీ కావడం కలకలం రేపుతోంది. విషయానికి వస్తే నెల్లూరు జిల్లా అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం రాత్రి ఓ ప్రముఖ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది.

కోర్టు సిబ్బంది దీని మీద స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చోరీ విషయం వెలుగు చూసింది. పోలీసులకు అందిన ఫిర్యాదులో గురువారం తెల్లవారుజామున కోర్టులో పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల బ్యాగు కనిపించకుండా పోయాయని ఉంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు కోర్టు బయట కల్వర్టులో చోరీకి గురైన బ్యాగు మాత్రమే దొరికింది. అయితే పలు కీలక పత్రాలు మాత్రం లభ్యం కాలేదు అంటున్నారు.

ఇంతకీ ఆ కీలక పత్రాలు ఏంటి. అవి మాయం కావడంతో వాటికి ఉన్న విలువ ఏంటి అన్న చర్చ గట్టిగా సాగుతోంది. ఈ విషయం చూస్తే ఇటీవల మంత్రి అయిన కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై గతంలో టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాఖలు చేసిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలు చోరీకి గురైనట్లు సమాచారంగా ఉందిట‌. అప్పట్లో అంటే 2017లో కాకాణి సోమిరెడ్డి మీద పలు సంచలన ఆరోపణలు చేశారు.

ఆయనకు విదేశాల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు ఇవే అంటూ ఆస్తుల పత్రాలుగా పేర్కొంటూ కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు. అయితే అవి నకిలీ పత్రాలు అని తేలడంతో కాకాణిపైన చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాకాణిపై కోర్టులో పరువు నష్టం కేసు కూడా వేశారు.

ఆ తరువాత చూస్తే నకిలీ పత్రాలే అని రుజువు కావడంతో కాకాణి మీద చార్జీషీట్ కూడా వేసి దర్యాప్తుని చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. ఈ నేపధ్యంలో చోరీకి గురి అయిన వాటిలో కీలక పత్రాలు పోయాయి అంటే అవి ఆ కేసులోని నకిలీ పత్రాలేనా అన్న చర్చ సాగుతోందిట.

ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే చోరీ అంటూ జరిగితే విలువైన ఆస్తులు పోతాయి. కానీ ఇక్కడ కేవలం కొన్ని కీలకమైన పత్రాలు మాత్రమే పోవడంతో అందరిలో అనుమానాలు కలుగుతున్నాయి. పైగా దొంగలు విలువైన వస్తువులు ఏవీ అసలు టచ్ చేయలేదని అంటున్నారు. మరి ఆ కీలక పత్రాలకే అంత విలువ ఉంటే. ఉంటే అవేమిటి అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

మరో వైపు చూస్తే దీని మీద ప్రతిపక్ష టీడీపీ పలు ఆరోపణలు చేస్తోంది. చోరీ సమయంలో కోర్టు లో ఉండే సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదని నిలదీస్తున్నారు. అదే విధంగా కాకాణి అనుచరుల పనే ఇది అని కూడా ఆ పార్టీ నేతలు అంటున్నారు. మంత్రి అయ్యారు కాబట్టే నకిలీ పత్రాలను చోరీ చేసి కేసు నుంచి బయటపడేందుకు చూస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు.

అయితే నిజానిజాలు ఏంటి అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఆరోపణలు ఎపుడూ ఉన్నవే. అసలు చోరీ అయిన వాటిలో కీలకపత్రాలు దేనికి సంబంధించినవి అన్నది పోలీసులు దర్యాప్తులో బయటపడితేనే వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. మొత్తానికి ఈ చోరీ అందునా కోర్టులో చోరీ నెల్లూరు లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది అనే అంటున్నారు.