Begin typing your search above and press return to search.

జగన్ సర్కారును విమర్శించేందుకు నోట మాట రాదంతే

By:  Tupaki Desk   |   24 Dec 2021 8:36 AM GMT
జగన్ సర్కారును విమర్శించేందుకు నోట మాట రాదంతే
X
మైకు దొరికినంతనే నాన్ స్టాప్ గా మాట్లాడేసే నేతల్ని చాలామందే చూసి ఉంటారు. కానీ.. తాను మాట్లాడినంతనే తిమ్మిని బమ్మిని.. బమ్మిని తిమ్మిని చేసే రేర్ క్వాలిటీ ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు సొంతం. ఏపీలోని జగన్ సర్కారుపై తీవ్రంగా విమర్శలు చేసే వారిని.. తన వాదనతో కన్వీన్స్ చేసే టాలెంట్ ఆయన సొంతం. జర్నలిస్టుగా ఈనాడులో సుదీర్ఘంగా పని చేసిన ఆయన.. అప్పట్లో పరిశోధనాత్మక కథనాల పేరుతో కొన్ని కథనాల్ని రాసేవారు. ఆ సందర్భంగా అలవాటైన గణాంకాల్ని.. నేటికి ఆయన మర్చిపోనట్లున్నారు.

జగన్ ప్రభుత్వ సక్సెస్ ను ఆయన మాటల్లో చెప్పే కన్నా.. గణాంకాల రూపంలో వివరించేందుకు ఎక్కువగా ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఏపీలోని రైతుల కోసం తమ ప్రభుత్వం తపిస్తున్న తీరును ఆయన చెప్పే మాటలు వింటే.. సిల్వర్ స్క్రీన్ మీద సినిమా కంటే స్పష్టంగా కనిపించక మానదు.

సీఎం జగన్మోహన్ రెడ్డిచేస్తున్న మంచి పనుల్ని తట్టుకోలేకపోతున్న విపక్ష నేత చంద్రబాబు.. అదే పనిగా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాడేపల్లిలో తాజాగా విలేకరులతో మాట్లాడిన ఆయన.. తాను సిద్ధం చేసుకున్న గణాంకాల కుప్పను మీడియా సాక్షిగా జనాలకు వివరించే ప్రయత్నం చేశారు. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఎంతలా డెవలప్ చేసిందన్న విషయాన్ని ఆయన అదే పనిగా చెప్పే ప్రయత్నం చేశారు.
మంత్రి కన్నబాబు చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే..

- వ్యవసాయ రంగంలో దేశ వృద్ధిరేటు 4.8 శాతంగా ఉంటే రాష్ట్ర వృద్ధిరేటు 9.3 శాతం.

- ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. సీఎం జగన్‌ చర్యలతో ఇది సాధ్యమైంది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్, ఐసీఏఆర్‌ శాస్త్రవేత్తలు, ఐక్యరాజ్య సమితి ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ నిపుణులు ప్రశంసిస్తున్నారు.

- 2014లో వ్యవసాయ రుణాలను మాఫీచేస్తానని హామీ ఇచ్చి, చేయకుండా రైతులను వంచించారు.
- పీఎం కిసాన్‌–వైఎస్సార్‌ రైతుభరోసా, బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపంలో రెండున్నరేళ్లలోనే రూ.90 వేల కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ రైతుల ఖాతాల్లో జమచేశారు.

- 2014 నుంచి 2019 మధ్య టీడీపీ సర్కార్‌ రైతుల నుంచి రూ.43 వేల కోట్ల విలువైన 2.81 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే.. వైఎస్సార్‌సీపీ సర్కార్‌ రెండున్నరేళ్లలోనే రూ.32,821 కోట్ల విలువైన 1.78 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.

- మొక్కజొన్న, జొన్న, పత్తి, కూరగాయలు, బత్తాయి, మామిడి వంటి పండ్లను రూ.6,434 కోట్లతో కొనుగోలు చేసి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాం.