Begin typing your search above and press return to search.

తీర‌ని శోకం: నిషీత్ అంత్య‌క్రియ‌లు పూర్తి

By:  Tupaki Desk   |   11 May 2017 6:12 AM GMT
తీర‌ని శోకం: నిషీత్ అంత్య‌క్రియ‌లు పూర్తి
X
అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు. అత‌డి కోసం క‌న్న కోటి క‌ల‌లు క‌ల్ల‌లు కావ‌ట‌మే కాదు.. క‌న్నీరు మాత్ర‌మే మిగిలిన దుస్థితి. చేతికి అంది వ‌స్తున్న కొడుకు.. ఊహించ‌ని రీతిలో విగ‌త‌జీవిగా మార‌టానికి మించిన శోకం ఇంకేం ఉంటుంది? తాజాగా ఏపీ మంత్రి నారాయ‌ణ కుటుంబ స‌భ్యుల ఆవేద‌న అంతాఇంతా కాదు. త‌మ గారాల‌ప‌ట్టి నిషీత్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌టంపై వారు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.

బుధ‌వారం తెల్ల‌వారు జామున మూడు గంట‌ల వేళ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన అత‌న్ని.. నిన్న సాయంత్రానికి నెల్లూరు చేర్చ‌టం తెలిసిందే. ఏపీ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ పనుల్లో భాగంగా లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి నారాయ‌ణ కొడుకు మ‌ర‌ణ‌వార్త విన్న వెంట‌నే కుప్ప‌కూలిపోయారు. త‌న ప‌ర్య‌ట‌న‌ను అర్థాంతంర‌గా ముగించుకొని హుటాహుటిన బ‌య‌లుదేరిన ఆయ‌న‌.. ఈ రోజు ఉద‌యం మూడు గంట‌ల ప్రాంతంలో నెల్లూరు చేరుకున్నారు.

అచేనంగా ఉన్న కొడుకు భౌతికాయాన్ని చూసిన ఆయ‌న కంట‌త‌డి పెట్టారు. దీంతో.. వాతావ‌ర‌ణం ఒక్క‌సారి ఉద్విగ్నంగా మారింది. ఐసుపెట్టెలో శాశ్విత నిద్ర‌లోకి జారుకున్న అత‌డ్ని చూస్తుండిపోయిన నారాయ‌ణను చూసిన వారంతా అయ్యో అని అనుకోకుండా ఉండ‌లేని ప‌రిస్థితి. ఇక‌.. నారాయ‌ణ స‌తీమ‌ణి.. నిషీత్ త‌ల్లి ప‌రిస్థితి మ‌రింత దారుణం. కొడుకు మ‌ర‌ణ‌వార్త షాక్ నుంచి ఆమె కోలుకున్న‌ట్లుగా క‌నిపించ‌లేదు. కొడుకు మృత‌దేహాన్ని త‌దేకంగా చూస్తే.. జీవం లేని రీతిలో ఆమె ఉన్న వైనాన్ని చూసిన వారి కంట క‌న్నీరు ఆగ‌లేదు. అప్పుడ‌ప్ప‌డు ఐసు పెట్టె మీద కొడుకును నిమిరుతున్న ఆ త‌ల్లి వేద‌న చూస్తే.. గుండెలు మెలితిప్పే బాధ క‌ల‌గ‌టం ఖాయం.

నిషిత్ ను క‌డ‌సారి చూసేందుకు పెద్ద ఎత్తు ఏపీ.. తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ‌కీయ నేత‌లు.. నారాయ‌ణ విద్యాసంస్థ‌ల‌కు చెందిన ప‌లువురు.. అభిమానులు.. ప్ర‌జ‌లు పోటెత్తారు. నిషీత్ ను చూసిన ప్ర‌తిఒక్క‌రూ అయ్యో పాపం అంటూ త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.పెన్నాన‌ది స‌మీపంలో నిర్వ‌హించిన అంతిమ సంస్కారాల‌కు ముందు.. పెద్ద ఎత్తున అంతిమ‌యాత్ర‌ను నిర్వ‌హించారు. భారీ ఎత్తున సాగిన ఈ అంతిమ యాత్ర పెన్నాన‌దిస‌మీపంలో ఆగింది. ఉద‌యం 10 గంట‌ల ప‌దిహేను నిమిషాల ప్రాంతంలో నిషీత్ అంతిమ సంస్కారాల్ని మంత్రి నారాయ‌ణ పూర్తి చేశారు. శోక‌సంద్రంలో మునిగిన నారాయ‌ణ కుటుంబ స‌భ్యులు.. అభిమానులు.. ప్ర‌జ‌లు బాధాత‌ప్త హృద‌యాల‌తో ఇంటి ముఖం ప‌ట్టారు.