Begin typing your search above and press return to search.

ఎంత స్పీడ్ వెళ్లిందో ఆగిన మీట‌ర్ చెప్పింది

By:  Tupaki Desk   |   10 May 2017 4:47 PM GMT
ఎంత స్పీడ్ వెళ్లిందో ఆగిన మీట‌ర్ చెప్పింది
X
ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు విషీత్‌.. అత‌ని స్నేహితుడి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన రోడ్డు ప్ర‌మాదానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కొద్దిసేప‌టి క్రితం సీసీ కెమేరా ఫుటేజ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ఫుటేజ్‌ను ప‌లు ఛాన‌ళ్లు టెలికాస్ట్ చేశాయి. ఈ ఫుటేజ్ ప్ర‌కారం మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి 2.44 గంట‌ల‌కు ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.

వాయు వేగంతో వెళుతున్న‌ట్లుగా క‌నిపించిన కారు.. క‌నురెప్ప మాటున మెట్రో ఫిల్ల‌ర్‌ను ఢీ కొట్టిన‌ట్లుగా కనిపించింది. రాత్రిపూట కావ‌టం.. వెలుగు స‌రిగా లేక‌పోవ‌టంతో సీసీ కెమేరా ఫుటేజ్ స్ప‌ష్టంగా లేద‌ని చెప్పాలి. అయితే.. అమిత‌మైన వేగంతో వెళుతున్న కారు నేరుగా ఫిల్ల‌ర్‌ను ఢీ కొని.. ఎగిరి ప‌డిన దృశ్యం క‌నిపించింది.

ఇదిలా ఉండ‌గా.. యాక్సిడెంట్ గురైన కారు స్పీడో మీట‌ర్‌.. కారు ఎంత వేగంగా ప్ర‌యాణించిన విష‌యాన్ని వెల్ల‌డించింది. ముందుభాగం తీవ్రంగా దెబ్బ తిన్న కారులో ఆగి ఉన్న స్పీడో మీట‌ర్‌ను చూస్తే.. 200 మార్క్‌ను దాటి.. మీట‌ర్ ఆగిపోయిన దృశ్యం క‌నిపిస్తుంది. అంటే.. మెట్రో ఫిల్ల‌ర్‌ను కారు ఢీ కొట్టిన వేళ‌.. కారు గంట‌ల‌కు 200 నుంచి 210 కిలోమీట‌ర్ల స్పీడ్‌తో ప్ర‌యాణించి ఉంటుంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. మెట్రో ఫిల్ల‌ర్ లాంటి బ‌ల‌మైన వ‌స్తువును (ఖ‌రీదైన కారు గంట‌కు 200 కిలోమీట‌ర్ల వేగంతో ఢీ కొట్టినా. పిల్ల‌ర్ ఏ మాత్రం చెక్కు చెద‌ర‌క‌పోవ‌టం గ‌మనార్హం) ఢీ కొన్న‌కార‌ణంగానే ఘ‌ట‌నాస్థ‌లంలోనే నారాయ‌ణ కుమారుడు మ‌ర‌ణించ‌టానికి కార‌ణ‌మైంద‌ని చెప్పొచ్చు.