Begin typing your search above and press return to search.

పవన్... మాతో కలవండి : దేశం పిలుపు

By:  Tupaki Desk   |   6 Jan 2019 5:58 PM GMT
పవన్... మాతో కలవండి : దేశం పిలుపు
X
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హోరు రోజురోజుకు పెరుగుతోంది. ఇక నాలుగు నెలల సమయమే ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులు, పైఎత్తులు, వ్యూ‍హాలు, ప్రతి వ్యూహాలకు తెరతీస్తున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ అయితే మరి కాస్త ముందుకు వెళ్లి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిపార్టీలను సైతం ఆహ్వానిస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసిన పవన్ కల్యాణ్ ఈసారి కూడా తమతో చేతులు కలపాలని తెలుగు తమ్ముళ్లు వర్తమానం పంపుతున్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, పలు విద్యా సంస్ధలకు చెందిన నారాయణ మరింత దూకుడు మీదున్నారు. పవన్ కల్యాణ్ తమతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నారాయణ జనసేనాని పవన్ కల్యాణ్ కు ఆహ్వనం పంపుతున్నారు. ఇటీవల తమతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా, తమకు గతంలో మద్దతు పలికినట్లుగానే ఈసారి మద్దతు పలకాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేనానికి ఆహ్వానం పలికారు. ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన పవన్ కల్యాణ్ తాము వామపక్షాలతోనే కలిసి పోటీ చేస్తామని, ఇతర పార్టీలతో కలిసేది లేదని తెగేసి చెప్పారు.

అయితే, తెలుగుదేశం నాయకులు మాత్రం తమ ప్రయత్నాలను వదిలిపెట్టడం లేదు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గట్టెక్కడం కష్టమని తేలిపోవడంతో మరోసారి పవన్ కల్యాణ్ తో స్నేహం తప్పని సరిగా తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందని, బీజేపీని ఓడించేందుకు తమతో కలవాలంటూ తెలుగుదేశం నాయకుడు, మంత్రి నారాయణ జనసేనాని పవన్ కల్యాణ్ తో మంతనాలు జరిపుతున్నట్లు చెబుతున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీని గద్దె దించేందుకు తమతో కలిసి రావాలన్నా నారాయణ ఆహ్వానాన్ని పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించినట్లు జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం 75 వేల కోట్లు ఇవ్వాలని జనసేనాని పవన్ కల్యాణ్ నియమించిన నిజ నిర్దారణ కమిటీ తేల్చిందని, ఈ నిధులు రాబట్టుకోవాలంటే తమతో కలవాలనే కొత్త ప్రతిపాదనను మంత్రి నారాయణ తీసుకువస్తున్నారని అంటున్నారు. పవన్ కల్యాణ్ ను తమ వైపు తిప్పుకోవాలనుకుంటున్న తెలుగుదేశం అధిష్టానం రానున్నే ఎన్నికల్లో గెలుపు కష్టమనే అభిప్రాయానికి వచ్చిందని అంటున్నారు.